హైదరాబాద్: అభద్రతా భావంతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (KTR) రేవంత్ రెడ్డి కేసు పెట్టారని ఆ పార్టీ నేత మన్న క్రిశాంక్ (Manne Krishank) విమర్శించారు. ఫార్ములా ఈ-కార్ రేస్ అంటే ఒక ఈవెంట్ మాత్రమే కాదని, దానిద్వారా రూ.700 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయన్నారు. ఒక్క ఈవెంట్‌కే అన్ని పెట్టుబడులు వస్తే మరిన్ని ఈవెంట్లు జరిగితే ఇంకా ఎన్ని పెట్టుబడులు వచ్చేవోనని చెప్పారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బోగస్ కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని, వాటిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తెచ్చిన పెట్టుబడులతో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా పరిశ్రమలు కనిపిస్తాయని, మరి రేవంత్ తెచ్చిన పెట్టుబడులతో వచ్చిన పరిశ్రమలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్, బీజేపీలు ఎట్టకేలకు కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి తెచ్చుకున్నాయి . ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు ఎఫ్ఐఆర్లో అవినీతి గురించి ప్రస్తావన లేదు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కొనసాగిస్తే కేసీఆర్, కేటీఆర్‌కు పేరొస్తుందని రేవంత్ రెడ్డి ఆ ఈవెంట్‌ను ఆపారు. ఆ ఈవెంట్ నిర్వహించిన కంపెనీ తనకు లంచం ఆశ చూపిందని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. మరి ఏ దర్యాప్తు సంస్థకు దాని గురించి ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. అభద్రతా భావంతోనే కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి కేసు పెట్టారు. కేటీఆర్ అనేక భాషల్లో బాగా మాట్లాడుతారు. ఇండియా, తెలంగాణ గురించి అంతర్జాతీయ వేదికల మీద బ్రహ్మాండంగా మాట్లాడతారు. అందుకే కేటీఆర్‌పై రేవంత్ కక్ష కట్టారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ అంటే ఒక ఈవెంట్ మాత్రమే కాదు. రూ.700 కోట్ల మేర పెట్టుబడులు తెచ్చింది. ఒక్క ఈవెంట్‌కే అన్ని పెట్టుబడులు వస్తే మరిన్ని ఈవెంట్లు జరిగితే ఇంకా ఎన్ని పెట్టుబడులు వచ్చేవో?. ఇవుడు రేవంత్ బోగస్ కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మంకీమ్న్ బయో అనే కంపెనీతో జూన్‌లో రూ.345 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ కంపెనీని యతిరాజం మధుశేషు అనే చార్టర్ అకౌంటెంట్ పేరుతో కేవల రూ.లక్ష మూల ధనంతో ఈ నెలలోనే రిజిస్టర్ చేశారు. లక్ష రూపాయల కంపెనీతో రూ.345 కోట్ల ఒప్పందమా?. బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునే కుట్ర దీని వెనక ఉందా?. దర్యాప్తు జరగాలి. పిలగాడు పుట్టక ముందే పదో తరగతి పాస్ అయినట్టు ఉంది ఈ మొత్తం వ్యవహారం. ఈ కంపెనీ వెనుక ఏ మంత్రి ఉన్నాడో నిగ్గు తేల్చాలి.
రాష్ట్రానికి మేలు చేసిన ఫార్ములా ఈ-కారు రేసింగ్ పైన కాదు కేసు పెట్టాల్సింది. బోగస్ కంపెనీల భాగోతాన్ని నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరపాలి. రేవంత్ రెడ్డి తమ్ముడు జగదీశ్వర్ రెడ్డి కంపెనీతో కూడా గతంలో ఇలాంటి బోగస్ ఒప్పందం కుదుర్చుకున్నారు. గోది మీడియా, వాల్ష్ కర్రా లాంటి నకిలీ సంస్థలతో కూడా రేవంత్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కేటీఆర్ తెచ్చిన పెట్టుబడులతో వచ్చిన పరిశ్రమలు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ దాకా కనిపిస్తాయి. రేవంత్ పెట్టుబడులతో వచ్చిన పరిశ్రమలు కనిపించవేం?. పెట్టుబడులు తెచ్చిన కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడతారు. మరి బోగస్ పెట్టుబడుల ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ మంత్రివర్గంపై కేసులు ఉండవా?. ఈడీ, ఏసీబీ ఈ బోగస్ కంపెనీలపై విచారణ జరపరా?. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.’ అని క్రిశాంక్ అన్నారు.