Deekshith Shetty | ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న నటుడు దీక్షిత్ శెట్టి తన కొత్త చిత్రం ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ ప్రచార కార్యక్రమాల్లో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ప్రధాన పాత్ర పోషించిన మరో చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’లో తన సహనటి అయిన రష్మిక మందన్నా వ్యక్తిగత జీవితం గురించి మీడియా అతడిని ప్రశ్నించగా.. దీనిపై సున్నితంగా స్పందించాడు దీక్షిత్.
దీక్షిత్ మాట్లాడుతూ.. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి నేను పట్టించుకోను. సహనటీనటుల పర్సనల్ విషయాల గురించి ఎక్కడా మాట్లాడకపోవడం అనేది ఒకరినొకరు గౌరవించుకునే మంచి పద్ధతి అని ఆయన అన్నారు. అలాగే రష్మిక వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆమె ప్రేమ, ఎంగేజ్మెంట్ గురించి నేనెప్పుడూ ఆమెతో చర్చించలేదు. ఎందుకంటే నాకు అలాంటి విషయాల్లో ఆసక్తి ఉండదు. మేమిద్దరం ఎప్పుడూ సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం అని వివరించారు. రష్మిక, దీక్షిత్ శెట్టి కలిసి నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే రష్మికకు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగినట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి.