Tomato Soup | టొమాటోలను మనం రోజూ తింటూనే ఉంటాం. వీటితో అనేక రకాల కూరలను, వంటకాలను చేస్తుంటారు. చాలా వరకు కూరలు టొమాటోలు లేకుండా పూర్తి కావు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది ఉపయోగిస్తున్న కూరగాయల్లో టొమాటోలు ముందు వరుసలో నిలుస్తాయి. టమాటాలను కొందరు నేరుగా పచ్చిగానే తింటుంటారు. ఇంకొందరు రోజూ జ్యూస్ తయారు చేసి తాగుతారు. టొమాటోలలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి మనకు అనేక లాభాలను అందిస్తాయి. అయితే చలికాలంలో టొమాటోలతో సూప్ తయారు చేసి తాగితే ఎన్నో లాభాలు ఉంటాయి. టొమాటో సూప్ మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీన్ని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. టొమాటోలలో ఉండే అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఈ సీజన్లో మనకు ఎంతో మేలు చేస్తాయి. మనల్ని పలు రోగాల నుంచి రక్షిస్తాయి.
టొమాటోలతో సూప్ తయారు చేసి రోజూ ఉదయం లేదా సాయంత్రం సేవించాలి. దీన్ని వల్ల అనేక లాభాలను పొందవచ్చు. టొమాటోలలో లైకోపీన్ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన కెరోటినాయిడ్స్ జాబితాకు చెందుతుంది. దీన్ని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా కూడా చెప్పవచ్చు. సూప్ రూపంలో టొమాటోలను వండడం వల్ల ఇందులో లైకోపీన్ శాతం పెరుగుతుంది. దీంతో మనకు ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. లైకోపీన్ వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా ప్రోస్టేట్, లంగ్స్, జీర్ణాశయ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. లైకోపీన్ వల్ల కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తుంది. దీంతో తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
టొమాటోలలో ఉండే లైకోపీన్, విటమిన్ సి, విటమిన్ ఎ వల్ల ఆక్సీకరణ ఒత్తిడి, వాపులు తగ్గిపోతాయి. దీని వల్ల రక్త నాళాల వాపులు తగ్గి అవి ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. టొమాటోలలో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. బీపీని తగ్గిస్తుంది. అందువల్ల హైబీపీ ఉన్నవారు టొమాటో సూప్‌ను రోజూ తాగుతుంటే ఎంతగానో ఫలితం ఉంటుంది. టొమాటోలలో విటమిన్ కె అధిక మొత్తంలో ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా అడ్డుకోవచ్చు. అలాగే విటమిన్ కె వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. దృఢంగా మారుతాయి.
టొమాటోలలో అధికంగా ఉండే విటమిన్ సి వల్ల మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం సాగేలా చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే ముఖంపై ఉండే మొటిమలు, ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. కళ్ల కింద ఉండే నల్లని వలయాలు కూడా తొలగిపోతాయి. టొమాటోలను నేరుగా ఫేస్ ప్యాక్ రూపంలో వాడడం వల్ల కూడా ఎంతగానో ఫలితం ఉంటుంది. లేదా రోజూ టొమాటో సూప్‌ను అయినా తాగవచ్చు. దీని వల్ల ఈ సీజన్లో చర్మం పగలకుండా సురక్షితంగా ఉంటుంది. టొమాటోలలో ఉండే విటమిన్ సి, ఎ, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇక టొమాటోలలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరిచి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక టొమాటోలతో సూప్‌ను తయారు చేసి రోజూ తాగితే ఎంతగానో ఫలితం ఉంటుంది.