కోదాడ, ఏప్రిల్ 11 : కోదాడ బైపాస్ వద్ద 65వ జాతీయ ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుండి ఢీ కొట్టిన దుర్ఘటనలో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, ప్రయాణికులు వెల్లడించిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ నుండి ఏలూరు వైపు వెళ్తున్న ఇంటర్ సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ బైపాస్ వద్ద ప్రధాన రహదారిపై వెనుక నుండి లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జు కాగా అందులో ప్రయాణం చేస్తున్న 46 మందిలో 16 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు 108 వాహనంలో క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు తెలిపారు. బస్సు మరో డ్రైవర్ సంఘటన స్థలం నుండి పారిపోయాడు.
బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర రోడ్లు రవాణా, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరా తీశారు. స్థానిక అధికారులతో మంత్రి ఫోన్ లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రయాణికులు ఎవరికీ ప్రాణాపాయం లేదని, కొంది మందికి స్వల్ప గాయాలు కాగా కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. గాయాలైన వ్యక్తులకు మెరుగైన చికిత్స చేయించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించి ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కోదాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 16 మందికి గాయాలు