Jag Vikram : అమెరికా, ఇరాన్ (USA, Iran) దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్ (LPG Tanker) గా జగ్ విక్రమ్ (Jag Vikram) నిలిచింది. ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్‌తో భారత్‌కు బయల్దేరింది. సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జలసంధిని దాటిన ఈ నౌక మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోకి ప్రవేశించింది.
ఈ గ్యాస్ ట్యాంకర్ 20 వేల టన్నుల ఎల్పీజీని తీసుకురానుంది. జలసంధిని దాటడానికి అనుమతి కోసం జగ్ విక్రమ్ వారం రోజులకుపైగా గల్ఫ్ జలాల్లో ఎదురుచూసినట్లు షిప్పింగ్ డేటా నివేదికలు వెల్లడించాయి. ఈ ట్యాంకర్ ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ యాజమాన్యానికి చెందినదిగా తెలుస్తున్నది. మరో 15 భారత రిజిస్టర్డ్ నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోనే ఉన్నాయని, త్వరలో అవి కూడా ఇదే మార్గం గుండా భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.
ఆ 15 నౌకల్లో ఒకటి ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్, నాలుగు ముడి చమురు ట్యాంకర్లు, ఒక ఎల్ఎన్జీ ట్యాంకర్, ఒక రసాయన ఉత్పత్తుల ట్యాంకర్, మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్లు, మూడు ఇతర నౌకలు ఉన్నట్లు తెలుస్తున్నది.