President Drupadi Murmu | తీర్థయాత్రల పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకం ( పిల్గ్రిమేజ్ రెజువనేషన్ అండ్ స్పిరిచ్యువల్లీ ఆగ్మెంటేషన్ డ్రైవ్-ప్రసాద్ ) పథకాన్ని వరంగల్లోని రామప్ప(రుద్రేశ్వర) ఆలయం, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28న ప్రారంభించనున్నారు.
ఈ ప్రసాద్ పథకంలో భాగంగా ఆలయం వెలుపల అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన వంటి పనులు చేపట్టనున్నారు. ముఖ్యంగా పర్యాటకులకు విశ్రాంతి భవనాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కింగ్ సదుపాయం, రహదారుల విస్తరణ, అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్, టాయిలెట్లు, బస చేయడానికి హోటళ్లు, వసతి గృహాలు, తాగునీరు, క్యూలైన్లు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు మ్యూజియం, శిల్పారామం వంటి సదుపాయాలు కూడా కల్పించాల్సి ఉంది. పనులను రెండేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రామప్ప ఆలయానికి ఇప్పటికే యునెస్కో గుర్తింపు లభించడంతో టూరిస్టులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అభివృద్ధి పనులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం తదితర ఆలయాలను కూడా ఈ పథకంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రాన్ని కోరింది.