కొలువుల కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఉద్యోగార్థుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను నోటిఫై చేయడంతోపాటు భర్తీకి వేగంగా చర్యలు తీసుకుంటుండడంతో అభ్యర్థులు సైతం అంతే ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ సేకరించుకునే పనిలో పడ్డారు. శిక్షణ తీసుకునేందుకు కోచింగ్ సెంటర్లను సంప్రదిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన శుక్రవారం పలుచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
కరోనా ఫస్ట్, రెండో వేవ్ నేపథ్యంలో జిల్లా కేంద్రంతో పాటు, నియోజకవర్గాల్లోని కోచింగ్ సెంటర్లు విద్యార్థులు లేక వెలవెలబోయాయి. కొన్ని కోచింగ్ సెంటర్లు పూర్తిగా మూతపడ్డాయి. ప్రస్తుతం ప్రభుత్వం త్వరలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేస్తామని ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ఉన్న నల్లగొండలోని పలు కోచింగ్ సెంటర్లకు యువత క్యూ కడుతున్నారు. నల్లగొండలో ఆరు, మిర్యాలగూడ, దేవరకొండతో పాటు సూర్యాపేట, భువనగిరిలో ఒకటి, రెండు శిక్షణ సంస్థలు నడుస్తున్నాయి. అభ్యర్థులు ఉత్తమ ఫ్యాకల్టీ, డైలీ టెస్టుల నిర్వహణ, ప్రామాణిక స్టడీ మెటీరియల్ ఇస్తున్న సంస్థలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు ఎక్కువ ఫీజు చెల్లించి మరీ నాణ్యమైన కోచింగ్ సెంటర్లలో చేరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో నల్లగొండ శిక్షణ కేంద్రాల అడ్డాగా చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండలో శిక్షణకు చాలామంది అభ్యర్థులు వస్తుంటారు. అప్పట్లో విజయనగరం నుంచి వచ్చి నైస్ శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అదే స్ఫూర్తితో నల్లగొండ జిల్లాకేంద్రంలో ఆరు సంస్థలు ఉత్తమ శిక్షణ అందిస్తున్నాయి.
నల్లగొండలో గ్రూప్స్ నుంచి టీఆర్టీ, టెట్, పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చే సంస్థ – హైదరాబాద్ రోడ్డులోని భవిత స్టడీ సర్కిల్ , అదేవిధంగా బ్యాంకింగ్, టెట్, టీఆర్టీ, పోలీస్ ఉద్యోగాలకు, గ్రూప్స్‌కు అవనిగడ్డ శిక్షణ సంస్థ, కేవలం గ్రూప్స్‌కు నాగార్జున స్టడీ సర్కిల్, పోలీస్, వివిధ ఉద్యోగాలకు జయం, శేఖర్, ైస్లెస్-2 ఇనిస్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో సంవత్సరం మొత్తం ఏదో ఒకరకమైన శిక్షణ ఇచ్చే సంస్థ భవిత, అవనిగడ్డ మాత్రమేనని ఆయా సంస్థల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంతో కొలువుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా ఈసారి ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో ఆయా అంశాల్లో శిక్షణకు కోచింగ్ సెంటర్స్ వైపు పరుగులు తీస్తున్నారు. అంతేగాక ఆయా ఉద్యోగ అంశాలపై ప్రత్యేక ప్రణాళికతో ప్రిపరేషన్‌కు పుస్తకాలు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో నల్లగొండ జిల్లాకేంద్రంలోని శిక్షణ సంస్థలు అప్పుడే జాతరను తలపిస్తున్నాయి. ఈ పర్యాయం స్థానికతకు పెద్దపీట వేయడంతో పాటు వయో పరిమితి పెంపుతో ఉద్యోగాల్లో తీవ్ర పోటీ నెలకొననుంది. ప్రణాళికతో చదివితే త్వరలో వచ్చే వేలాది పోస్టుల్లో ఉద్యోగం సాధించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
కరోనా వ్యాప్తితో రెండేళ్లుగా ఇనిస్టిట్యూట్ నిర్వహణ లేక తీవ్ర ఇబ్బంది పడ్డాం. విద్యార్థుల కోరిక మేరకు ఆన్లైన్ శిక్షణ ఇచ్చినా కోచింగ్ సెంటర్ అద్దెలు సైతం చెల్లించలేని స్థితి ఉండే. ప్రభుత్వం 80,039 పోస్టులను వివిధ శాఖల్లో భర్తీ చేస్తామని ప్రకటించడంతో మళ్లీ శిక్షణకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఎస్ఐ, పీసీ బ్యాచ్ శిక్షణ పూర్తి కావస్తుంది. నూతన బ్యాచ్‌లుగా గ్రూప్స్, పోలీసు, ఇతర పోటీ పరీక్షలకు విద్యార్థులు చేరారు. వారి శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్రస్థాయిలో అత్యంత నిపుణులైన ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజులతో శిక్షణ అందిస్తూ ఎంతోమంది ఉద్యోగాలు సాధించేలా చేశాం. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతాం.
– తుమ్మురి వెంకట్‌రెడ్డి, భవిత స్టడీ సర్కిల్ నిర్వాహకుడు, నల్లగొండ
సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన మాట మేరకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామనడం ఆనందం కలిగించింది. దీంతో నాలో కొత్త ఆశలు చిగురించాయి. నాకు ఎస్ఐ కావాలని ఉంది. భవితలో ఉత్తమ శిక్షణ ఇస్తున్నారని తెలిసి ఇందులో చేరా. నిత్యం ప్రత్యేక ప్రణాళికతో చదివేందుకు తయారై సొంతంగా టెస్టులు సైతం ప్రాక్టీసు చేస్తున్నా. ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన సీఎం కేసీఆర్సార్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– ఆర్.కుమారి, విద్యార్థి, భవిత స్టడీ సర్కిల్, నల్లగొండ.
కచ్చితంగా ఉద్యోగాల నోటిఫికేషన్స్ వస్తాయనే ఉద్దేశంతో కొన్ని నెలలుగా శిక్షణ తీసుకుంటున్నా. నిత్యం ప్రాక్టీస్ టెస్టులు, వీక్లీ టెస్టుల నిర్వహణతో నేను చదువుకునే దాంతో పాటు ఉద్యోగ సాధనలో శిక్షణ తీసుకోవడం చాలా బాగుంది. ఫ్యాకల్టీ చెప్పే అంశాలు ఇంటికెళ్లి ప్రాక్టీస్ చేస్తుండటంతో ఎలాంటి సందేహాలు వచ్చినా మరుసటి రోజు సార్లను అడిగితే వెంటనే చెప్తున్నారు. ఈ పర్యాయం కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం కలిగింది.