ముంబై, అక్టోబర్ 17: బంగారం ధరలు ప్రస్తుతం ఏ స్థాయిలో పరుగులు పెడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు కొనుగోలుదారులు, ఇటు మదుపరుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుండటంతో దేశ, విదేశీ మార్కెట్లలో రోజూ ఆల్‌టైమ్ హై రికార్డులు నమోదవుతున్నది చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఈ గోల్డ్ రష్ ఇకముందూ ఉంటుందని, దీంతో అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే ఔన్స్ పసిడి విలువ ఏకంగా 4,500 డాలర్లు పలకవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే భారతీయ విపణిలో పుత్తడి రేట్లు సరికొత్త స్థాయిలను అందుకోవడం ఖాయమన్న అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇదీ సంగతి..
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను వేగంగా పెంచుకునే పనిలోపడ్డాయి. అలాగే భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తకర పరిస్థితులు, ఆసియా దేశాల నుంచి పెద్ద ఎత్తున కనిపిస్తున్న డిమాండ్ కూడా పసిడి ధరలను ఎగదోస్తున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విడుదల చేసిన ఓ నివేదిక చెప్తున్నది. ఈ క్రమంలోనే ఔన్స్ గోల్డ్ వాల్యూ గ్లోబల్ మార్కెట్లో 4,500 డాలర్లకు చేరవచ్చని అంటున్నది. ప్రస్తుతం 4,304 డాలర్ల సమీపంలో కదలాడుతున్నది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు, వివిధ దేశాల స్టాక్-కరెన్సీ మార్కెట్లలో ఒడిడొడుకులు కూడా గోల్డ్ రన్‌కు దారితీస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించాలని ట్రంప్ సర్కారు విపరీతంగా ఒత్తిడి చేస్తున్నది. ఈ ఒత్తిళ్లకు ఫెడ్ రిజర్వ్ తలొగ్గే పరిస్థితులు నెలకొంటుండగా.. వడ్డీరేట్లు తగ్గినకొద్దీ బాండ్ మార్కెట్ కళావిహీనంగా మారనున్నది. వడ్డీరేట్లు తగ్గి బాండ్ల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రాబడులు లేకపోతే మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం బంగారం వైపునకే వెళ్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది కూడా. అందుకే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇక చైనా, భారత్ తదితర ఆసియా దేశాల నుంచి డిమాండ్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఇవన్నీ కూడా ఆల్‌టైమ్ హై రికార్డుల్ని గోల్డ్ చేత కొట్టించేస్తున్నాయని మెజారిటీ మార్కెట్ విశ్లేషకుల మాట.
75 డాలర్లకు వెండి ధర?
ఈ ఏడాది బంగారం ధరలతోపాటు వెండి రేట్లూ విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఔన్స్ సిల్వర్ రేటు 75 డాలర్లను తాకవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేస్తున్నది. ప్రస్తుతం 55 డాలర్ల దరిదాపుల్లో ఉండగా.. త్వరలోనే మరో 20 డాలర్లు ఎగబాకవచ్చని అంటున్నది. సాధారణ కొనుగోలుదారులతోపాటు ఇన్వెస్టర్లు, ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా వెండికి డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణంగా ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. అలాగే రిజర్వ్ బ్యాంకులు గోల్డ్‌తోపాటు వెండి నిల్వలపట్ల ఆసక్తి కనబరుస్తుండటం మార్కెట్లో సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసింది.
తులం రూ.1,34,800
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి రేటు 10 గ్రాములు రూ.3,200 పుంజుకున్నది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా ఢిల్లీ స్పాట్ మార్కెట్లో తులం రూ.1,34,800 పలికింది. శనివారం ధనత్రయోదశి దృష్ట్యా జ్యుయెల్లర్స్, రిటైలర్స్ నుంచి పెరిగిన డిమాండే కారణమని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. ఇక హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్ ధర రూ.3,300 ఎగసి రూ.1,32,770గా నమోదైంది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రేటు రూ.3,050 ఎగబాకి రూ.1,21,700గా ఉన్నది. అయితే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో కిలో ఈ ఒక్కరోజే రూ.7,000 క్షీణించి రూ.1,77,000కు పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,303.73 డాలర్లు, సిల్వర్ 54.48 డాలర్లుగా ఉన్నాయి.