గ్రూప్స్ కొట్టాలనే లక్ష్యం ఎందరికో ఉంటుంది! గమ్యం దూరమని తెలుసు! ప్రయాణం భారమనీ తెలుసు!! కానీ, ఈ జర్నీలో ఒత్తిడితో ఎప్పుడూ పేచీ ఉంటుంది. సబ్జెక్టుపై పట్టు సాధించినా.. స్ట్రెస్‌తో చేతులెత్తేసే వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. పోలం ప్రతిభా శేఖర్ ప్రతిభ అందుకు విరుద్ధం. ఆమె తన ప్రతిభను నమ్ముకుంది. సిలబస్ మీద ధ్యాస, జీవితం మీద ప్రేమతో చదివి ప్రతికూలతలన్నిటినీ జయించింది. గ్రూప్ 1, గ్రూప్2, గ్రూప్3, గ్రూప్ 4 ఇలా నాలుగు పోటీ పరీక్షల్లో విజేతగా నిలిచింది. అమ్మానాన్నల అండదండలు ఉంటే ఆడపిల్ల అన్నిటా గెలుస్తుందన్న ప్రతిభ గెలుపు కథ ఆమె మాటల్లోనే..
మా అమ్మానాన్నకు నేనొక్కదాన్నే! అమ్మ రాష్ట్ర ఆర్థికశాఖలో ఉద్యోగి. నాన్న ఎల్ఐసీలో పనిచేస్తున్నారు. సెలవుల్లో అమ్మ నన్ను కూడా తన వెంట ఆఫీస్‌కు తీసుకెళ్లేది. సెక్రటేరియట్లో ఐఏఎస్ అధికారులను చూశాక.. పెద్ద ఆఫీసర్ కావాలనే కోరిక పుట్టింది. బట్టీ పట్టడం నాకు నచ్చదు. నాలెడ్జ్ ముఖ్యం అనుకునేదాన్ని. క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ నేనే! మా స్కూల్ (సెయింట్ ఆన్స్, బొల్లారం)లో వ్యాస రచన, వక్తృత్వం, క్విజ్ కాంపిటిషన్స్‌లో ఎన్ని ప్రైజ్‌లు వచ్చాయో! స్కూల్ కెప్టెన్‌గానూ పనిచేశాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వరంగల్)లో బీటెక్ చదివాను. అక్కడే ఒక షోకు హోస్ట్‌గా చేశాను. ఆ వీడియో అమ్మ చూస్తుంటే.. భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు చూశారట! ‘ఎవరీ అమ్మాయి?’ అని అడిగితే.. ‘మా అమ్మాయే’ అని చెప్పిందట. చాలా బాగా మాట్లాడుతున్నదని, సెలవులకు వస్తే ఓసారి రవీంద్రభారతికి తీసుకురమ్మన్నారట. ఆయన్ని కలిసినప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావని అడిగారు. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతానని చెప్పాను. ‘ఇది చదివి నెల రోజుల తర్వాత కలువు’ అంటూ నా చేతిలో ఒక పుస్తకం పెట్టారు. చదివాను. దాని గురించి ఆయనతో చర్చించాను. సివిల్స్ రాయడానికి ఫిట్ అవుతానని మావాళ్లతో చెప్పారు.
ప్రపంచమంతా కరోనా గుప్పిట్లో ఉన్న రోజుల్లో సివిల్స్ పరీక్షకు సిద్ధమయ్యాను. కోచింగ్ సెంటర్లన్నీ మూతపడ్డాయి. ఏ పుస్తకాలు చదవాలో తెలియదు. హరికృష్ణ సార్‌ని కలిశాను. ఏ సబ్జెక్ట్‌కి ఏ పుస్తకం చదవాలో చెప్పారు. పుస్తకాలు తెచ్చుకోవడం, సబ్జెక్ట్ గురించి తెలుసుకోవడంలోనే ఏడాది గడిచింది. కరోనా సెకండ్ వేవ్‌లో సీరియస్‌గా చదవడం మొదలుపెట్టాను. ఇంతలో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 2 ప్రకటన వచ్చింది. అదీ రాయాలనుకున్నాను. అప్పటికే కోచింగ్ సెంటర్లు తెరుచుకున్నాయి. కానీ, సొంత ప్రిపరేషన్ బాగానే ఉందని వాటి జోలికి వెళ్లలేదు. సిలబస్ మొత్తాన్నీ టాపిక్ల వారీగా విడగొట్టాను. రోజుకు ఇన్ని గంటలు చదవాలనే నియమం పెట్టుకోలేదు.
రోజుకు ఇన్ని టాపిక్స్ చదవాలనుకున్నాను. మొదట్లో అనుకున్న టాపిక్ పూర్తి కావడానికి రోజుకు ఏడెనిమిది గంటలు పట్టేది. అర్థంకాక ఇంకొన్ని పుస్తకాలు చదివాను. ఇంటర్నెట్లో వెదికాను. యూట్యూబ్‌లో విన్నాను. కొన్నాళ్లకు రోజుకు నాలుగు, అయిదు గంటల్లోనే టాపిక్ పూర్తయ్యేది. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కి ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ చదివితే సరిపోతుంది. కానీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగానికి అదనంగా తెలంగాణ చరిత్ర, ఉద్యమం చదవాలి. పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ చరిత్ర లేదు. అందుకని తెలంగాణ ఉద్యమ చరిత్ర కోసం ఎక్కువ సమయం కేటాయించాను.
మా అమ్మాయికి ఎన్నడూ ఆంక్షలు లేవు. అన్నీ ఆకాంక్షలే. సుకుమారంగా పెంచలేదు. ఆడపిల్లకు స్వేచ్ఛ ఉండాలి. అదొక్కటే మేమిచ్చాం. తనకాళ్లపై తాను నిలబడాలని మా కోరిక. పెండ్లి తర్వాత కూడా ఒకరిపై ఆధారపడకూడదు. ఎక్కడికి వెళ్తానన్నా ప్రోత్సహించాం.
– సుజాతా శేఖర్, తల్లి
ప్రతిభ బీటెక్ పూర్తయినప్పటి నుంచి ‘మీ అమ్మాయి ఇంకా జాబ్ ఎందుకు చేయడం లేద’ని కనిపించిన వాళ్లంతా అడిగేవారు. గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతోందంటే మమ్మల్ని పిచ్చోళ్లన్నట్టుగా చూసేవారు. ‘సర్కార్ నౌకరీ వస్తుందని కలలు కంటే ఎట్లా.. మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి పంపించొచ్చు కదా!’ అని కాస్త హేళనగా సలహాలిచ్చేవారు. ‘గ్యాప్ వస్తే.. ‘ఔట్ డేటెడ్’ అని సాఫ్ట్వేర్ జాబ్ కూడా రాదు’ అనేవారు. వాళ్లతో వేగలేక కొన్నాళ్లు ఫోన్లు ఎత్తడం, ఫంక్షన్లకు వెళ్లడం మానేశాం.
– పి.ఆర్. శేఖర్, తండ్రి
పోటీ పరీక్షలు ప్రతిభకే కాదు సహనానికీ పరీక్షే! అనుకున్న ప్రకారం సిలబస్ పూర్తి కాకపోతే ఒత్తిడి పెరుగుతుంది. నిరుత్సాహం ఆవహిస్తుంది. వాటిని అధిగమించడానికి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. ఒత్తిడి అధిగమించడానికి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. శ్రీశ్రీ, మీర్జా గాలిబ్, ఖలీల్ జిబ్రాన్ కవిత్వం చదివేదాన్ని. ఉర్దూ, హిందీ, ఇంగ్లిష్‌లో కవిత్వం రాసేదాన్ని. హిందీ-ఉర్దూ కవితా సంకలనం కూడా ఒకటి ప్రచురించాను. సినిమాలు చూశాను. సోలో ట్రావెల్ చేశాను. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో విహార యాత్రలకు వెళ్లాను. ఫొటోగ్రఫీ చేశాను. డ్రాయింగ్ గీశాను. వారంలో అయిదు రోజులు చదువుకుంటే.. రెండు రోజులు ట్రావెల్లో గడిపేదాన్ని. దీంతో స్ట్రెస్ ఫీలింగే రాలేదు.
యూపీఎస్సీ ప్రిలిమ్స్ రెండుసార్లు రాశాను. ఎస్.ఎస్.సి. పరీక్ష కూడా రాశాను. ఏదీ రాలేదు. మానసికంగా కుంగిపోయాను. నెల రోజులు ఏ పనీ చేయలేదు. ఇలాగే ఉండిపోతే ఏం సాధించలేం అనిపించింది. ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నాను. గ్రూప్ 1 మీద ఫోకస్ చేశాను. వ్యాస రచన, విశ్లేషణలో హరికృష్ణ గారి సూచనలతో నైపుణ్యం సాధించాను. మాక్ పరీక్షలు రాశాను. మూల్యాంకనంలో ఏ అంశాలకు ఎక్కువ మార్కులు ఇస్తున్నారో గుర్తించాను. ఎక్కడ తప్పులు చేశానో అమిగోస్లో రఫీ సార్ విశ్లేషించారు. నోటిఫికేషన్లు, కోర్టు తీర్పులు, పరీక్ష రద్దు ఇవేవీ పట్టించుకోకుండా చదువుకోవడంపైనే ఫోకస్ చేశాను. అంతిమంగా గెలిచాను.
ఈ ప్రయాణంలో అమ్మానాన్న నన్నెంతగానో ప్రోత్సహించారు. మా బంధువుల్లో చాలామంది ‘ఎన్ఐటీలో చదివింది. నాలుగేళ్లయినా జాబ్ లేదు. ఇంట్లో కూర్చోబెట్టి కాంపిటీటివ్ పరీక్షలకు చదివిస్తున్నారేంటి? ఆడపిల్లకు విహారాలేంటి?’ ఇలా ఎన్నో మాటలు అన్నారు. ఆ మాటలకు నేనెంత బాధపడ్డానో, అమ్మానాన్న కూడా అంతే ఇబ్బందిపడ్డారు. ఈ ఒత్తిడి అధిగమించడానికి బయటికి వెళ్తానంటే.. ఓకే అన్నారు. ‘నాలెడ్జ్ కేవలం పుస్తకాల్లోనే కాదు బయటి ప్రపంచంలో కూడా ఉంద’ని చెప్పారు. అంతేకానీ, ఎవరి మాటలకో భయపడి గడప దాటొద్దని అనలేదు. ఈ ప్రిపరేషన్లో నేనెంత స్ట్రగుల్ అయ్యానో, మా పేరెంట్స్ కూడా అంతే స్ట్రెస్ అనుభవించారు. అమ్మానాన్న గర్వపడేలా చేయాలన్నదే నా డ్రీమ్. గ్రూప్స్ ఫలితాలు వచ్చిన రోజు నా కల నెరవేరింది అనిపించింది.
గ్రూప్ 1 స్కోర్ 483.5
గ్రూప్ 2 ర్యాంక్ 746
గ్రూప్ 3 ర్యాంక్ 160
గ్రూప్ 4 ర్యాంక్ 921
– నాగవర్ధన్ రాయల గడసంతల శ్రీనివాస్