హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను నరికేసిన 400 ఎకరాల భూములు న్యాయబద్ధంగా హెదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే చెందుతాయని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ నివేదికలో తేల్చిందని స్టూడెంట్ యూనియన్ వెల్లడించింది. ఆ భూముల్లో జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు సుప్రీం కోర్టుకు నివేదించిందని స్టూడెంట్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం కేంద్ర సాధికార కమిటీ నివేదికలోని ప్రధాన అంశాలను ప్రస్తావిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. చారిత్రక రికార్డులు, న్యాయపరమైన ఆధారాల ప్రకారం 400 ఎకరాలతోపాటు హెచ్సీయూ పరిధిలో ఉన్న భూములన్నీ వర్సిటీకే చెందుతాయని సీఈసీ ఆధారాలతో సహా తేల్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. ఆ భూములపై హక్కులను టీజీఐఐసీకి బదాలయించడంలో లోపాలను ఎత్తి చూపిందని తెలిపారు. కంచ గచ్చిబౌలిలోని 2,300 ఎకరాల భూమి రికార్డుల ప్రకారం యూనివర్సిటీకే చెందుతుందని, అప్పటి రికార్డుల్లో ‘కంచ అస్తాబల్ పోరంబోకు సర్కారీ’గా నమోదు చేసినట్టు తెలిపారు.