కేంద్రంలోని బీజేపీ సర్కార్ అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడంపై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేసిందని విరుచుకు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిర సిస్తూ సోమవారం అన్నివర్గాల ప్రజలు పోరుబావుటా ఎగురవే శారు. సమ్మె సైరన్ మోగించారు. సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్తోపాటు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన సార్వత్రిక సమ్మె విజ యవంతమైంది. పల్లె నుంచి పట్టణం వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేసి మద్దతు తెలిపాయి. వివిధ కార్మిక సంఘాల నాయకులు బస్‌డిపోల ఎదుట బైఠా యించి ఆందోళన చేపట్టారు. దీంతో ఉమ్మడి జిల్లాలో దాదాపు 700కు పైగా బస్సులు మధ్యాహ్నం 2 గంటల వరకు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థలు బంద్ చేసి సమ్మెకు సహకరించాయి. సింగరేణి కార్మికులు విధులకు గైర్హాజరు కావడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బ్యాంకు ఉద్యోగులు ఆయా బ్యాంకుల ఎదుట నిరసన తెలిపారు.
ఖమ్మం, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కార్మిక చట్టాల సవరణ, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ, పీఎఫ్ వడ్డీ రేట్లు తగ్గింపు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరల పెంపునకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర సంఘాల పిలుపు మేరకు సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టెలికం, బీమా రంగ ఉద్యోగులు కార్మికులు, బ్యాంకర్లు చేపట్టిన ‘భారత్ బంద్’ గ్రాండ్ సక్సెస్ అయింది. ఉదయం 4 గంటలకే కార్మిక సంఘాల నాయకులు ఉమ్మడి జిల్లాలోని ఆరు బస్ డిపోల ఎదుట బైఠాయించి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సహా కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. సుమారు 700కు పైగా బస్సులు మధ్యాహ్నం 2 గంటల వరకు డిపోలకే పరిమితమయ్యాయి. ఖమ్మం నగరంతో పాటు పట్టణాల్లో రవాణా సౌకర్యం లేకపోవడం, పెట్రోలు బంకులు మూసి ఉండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో బస్టాండులు, ప్రధాన కూడళ్లలో ప్రయాణికులు గంటల కొద్దీ ఎదురుచూశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. బ్యాంకులు మూతపడడంతో ఖాతాదారుల లావాదేవీలు నిలిచిపోయాయి. బంద్‌లో టీఆర్ఎస్ కార్మిక విభాగంతోపాటు పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి. అసంఘటిత, సంఘటిత కార్మికులు, డ్రైవర్లు సైతం సమ్మెలో పాల్గొన్నారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి వంటి ప్రధాన పట్టణాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
సింగరేణి మణుగూరు, కొత్తగూడెం, ఇల్లెందు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో రైలు, రోడ్డు మార్గాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అందాల్సిన బొగ్గు రవాణాకు బ్రేక్ పడింది. ఓసీలు, మైన్స్ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. సమ్మెలో టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సహా సీఐటీయూ, ఏఐటీయూసీతోపాటు ఇతర కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. కొత్తగూడెం ఏరియా పరిధిలో 2200 మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.
చౌక్‌లో జరిగిన బహిరంగ సభలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కమర్తపు మురళి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, సీపీఐ రాష్ట్ర నాయకుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు సీతారాములు, టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు నున్నా మాధవరావు ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదన్నారు.
కారేపల్లిలో మాజీ శాసనసభ్యులు బానోతు మదన్‌లాల్ నాయకులు ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలుపై మోదీ వైఖరిని తెలంగాణ ప్రజలంతా నిరసిస్తున్నారని, మోదీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో నూకలు చెల్లడం ఖాయమన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇల్లెందు మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎడవల్లి కృష్ణ పాల్గొన్నారు. భద్రాచలం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో శాసనసభ్యుడు పొదెం వీరయ్య, ఏఐటీయూసీ, సీఐటీయూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సమ్మెలో మునిసిపల్ కాంట్రాక్టు కార్మికులు, ఆశ వర్కర్లు, వ్యవసాయ మార్కెట్ హమాలీలు, పౌరసరఫరాల సంస్థ హమాలీ కార్మికులు పాల్గొన్నారు. టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఉపరితల గనిలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అశ్వారావుపేట సమ్మెలో టీఆర్ఎస్తో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. మణుగూరులో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో పాటు సీపీఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ భారీ ప్రదర్శన నిర్వహించారు.