కొలంబో, మార్చి 31: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకున్నది. గురువారం రాత్రి కొలంబోలో వేలాది మంది ఆందోళనకారులు దేశ నివాసాన్ని ముట్టడించారు. పదవి నుంచి దిగిపోవాలంటూ పెద్ద ఎత్తన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులను, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారిపైకి నిరసనకారులు బాటిళ్లు, రాళ్లు రువ్వారు. పోలీస్ బస్సుకు నిప్పు పెట్టారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. భాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. నిరసనల సమయంలో రాజపక్స తన నివాసంలో లేరు. ఆందోళనల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
గత కొద్దివారాలుగా శ్రీలంక ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ధరలు కూడా భారీగా పెరగడంతో ఏమీ కొనే పరిస్థితి లేకుండాపోయింది. రోజుకు 13 గంటల పాటు కరెంటు కోత విధిస్తుండటంతో ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. స్టాక్ మార్కెట్లు రెండు గంటలు మాత్రమే పనిచేస్తున్నాయి. మెడిసిన్స్ అందుబాటులో లేకపోవడంతో పలు దవాఖానల్లో శస్త్రచికిత్సలు ఆగిపోయాయి. పేపర్ కొరతతో స్కూళ్లలో పరీక్షలనూ రద్దు చేశాకరెంటు లేకపోవడంతో మొబైల్ నెట్వర్క్ బేస్ స్టేషన్లు కూడా ప్రభావితమవుతున్నాయి. దీంతో మొబైల్ ఫోన్లకు సరిగ్గా నెట్వర్క్ అందట్లేదని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంకకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇదే అతి పెద్ద సంక్షోభంగా పేర్కొంటున్నారు.
దేశంలో విద్యుత్తు ఆదా చేసేందుకు వీధి దీపాలు ఆర్పేయాలని శ్రీలంక విద్యుత్తు శాఖ మంత్రి గురువారం ఆదేశించారు. విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో ప్రభుత్వం ఇంధన దిగుమతులు చేసుకోలేకపోతున్నది. దీంతో రోజుకు 13 గంటల పాటు విద్యుత్తు కోత విధిస్తున్నారు.