రెక్కలు ముక్కలు చేసుకొని, అప్పులు చేసి సాగుకు సిద్ధమైన రైతన్నలను నాసిరకం విత్తనాలు నట్టేట ముంచుతున్నాయి. జూన్‌లో కురిసిన తొలకరి వర్షాలకు ఆశగా విత్తనాలు వేసిన రైతన్నకు గుండెకోత మిగిల్చాయి. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి.. వందలాది ఎకరాల్లో రైతులు విత్తనాలు విత్తగా మొలకెత్తడం లేదు. అధికారుల నిఘా లోపం, ప్రైవేటు వ్యాపారుల అడ్డగోలు సంపాదన ఆశకుతాముబలిపశువులమయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలు, విత్తన కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఆదిలాబాద్, జూలై 4(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత అధికంగా సోయా సాగవుతుంది. ఏటా వానకాలంలో ఈ పంటను పండిస్తుండగా.. ఈ సీజన్ ఒక లక్ష ఎకరాల్లో సాగు చేసే అవకాశాలున్నాయి. కొంతకాలంగా ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. సాగు కోసం 25 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా, వ్యాపారులు మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి సోయా విత్తనాలు దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు. ఈ ఏడాది సీజన్‌కు ముందుగానే రైతులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతోపాటు ఇతర మండల కేంద్రాల్లోని ప్రముఖ కంపెనీలకు చెందిన విత్తనాలను విత్తారు. పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజుల్లో మొలకెత్తాల్సిన విత్తనాలు పది రోజులైనా మొలకెత్తలేదు. దీంతో సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.

విత్తనాలు కొనుగోలు చేసినప్పడు వ్యాపారులు పూర్తి వివరాలతో కూడిన రసీదులు ఇవ్వాలి. విత్తన తయారు కంపెనీ, లాట్ నంబరు, ధర, ఇతర వివరాలు రాయాలి. సంచులపై ఎక్సైరీ తేది ఉండాలి. విత్తనాలు వేసింది మొదలుకొని దిగుబడి వచ్చే వరకు వ్యాపారులు ఇచ్చిన రసీదులను రైతులు భద్రపర్చుకోవాలి. విత్తనాలు మొలకెత్తకపోయినా, దిగుబడి రాకపోయినా వ్యాపారులను అడిగే అవకాశాలున్నాయి. కొందరు వ్యాపారులు తమకు గతేడాది విత్తనాలు విక్రయించారని రైతులు అంటున్నారు. గతంలో ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసే సోయా సంచి 30 కిలోలు ఉండగా.. ప్రముఖ కంపెనీల పేరిట వ్యాపారులు 22 కిలోల సంచులను రూ.3400లకు విక్రయిస్తున్నారు.
కంపెనీలు విత్తనాల బరువు తగ్గించడంతో నష్టపోతున్నారు. రైతులు పండించిన సోయా మార్కెట్ ధర రూ.5600 ఉండగా.. విత్తనాలు క్వింటాకు రూ.15 వేలు చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. సోయా సాగుకు రెండెకరాలకు మూడు సంచులు అవసరమవుతుండగా.. ఎకరాకు రూ.8 వేల వరకు ఖర్చు అవుతున్నది. బేల మండలంలో విత్తనాలు మొలకెత్తని విషయంలో వ్యాపారులను సంప్రదిస్తే తాము ఏమీ చేయలేమని సంబంధింత కంపెనీల నిర్వాహకులతో మాట్లాడి మీ సమస్యను పరిష్కరించుకోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని రైతులు అంటున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

నిర్మల్, జూలై 4(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని హస్గుల్, హంపోలి, మాటేగాం, వాలేగాం, బిజ్జూర్, మాగాం గ్రామాల్లో వందలాది ఎకరాల్లో రైతులు సోయా సాగు చేశారు. భైంసా పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో వివిధ ప్రైవేటు కంపెనీలకు చెందిన విత్తనాలు కొనుగోలు చేశారు. ఈ విత్తనాలు వేసి పక్షం రోజులు గడుస్తున్నా మొలకలు రావడం లేదు. అనుమానంతో నేలను తవ్వి చూడగా, విత్తనాలన్నీ మొలకెత్తకుండా భూమిలోనే కుళ్లిపోయి కనిపించాయి. దీంతో వ్యవసాయ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకొన్నారు. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫర్టిలైజర్ దుకాణాల నమ్మక ద్రోహం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తమకు న్యాయం చేయాలని, అలాగే నకిలీ విత్తనాలు అంటగట్టిన దుకాణాలు, ఆయా కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

నకిలీ సోయా విత్తనాలు వేసి మోసపోయిన రైతులు ఎకరాకు దాదాపు రూ.14 వేల వరకు నష్టపోయినట్లు చెబుతున్నారు. దుక్కి దున్నేందుకు ఎకరాకు రూ. 2వేల వరకు ఖర్చవుతుంది. అలాగే సోయా పంట వేసేందుకు ఎకరానికి రెండు విత్తన బస్తాలు అవసరమవుతాయి. ఆయా కంపెనీలు, రకాలను బట్టి ఒక్కో బస్తా రూ.3,500 నుంచి రూ.4,500 వరకు ఉంటుంది. సగటున రూ.4 వేలు అనుకున్నా.. ఎకరాకు రెండు బస్తాలంటే రూ.8 వేలు విత్తనాల కోసమే పెట్టుబడి ఖర్చవుతుంది. అలాగే విత్తనాలు వేసేందుకు కూలీల ఖర్చు మరో రూ.3 వేలు, అడుగుమందుగా డీఏపీ ఎకరానికి రెండు బస్తాలు వేయాలి. దీనికి మరో రూ.1000.. ఇలా ఎకరం భూమిలో సోయా వేసేందుకు రూ.14 వేల పెట్టుబడి ఖర్చులు అవుతాయి. భైంసా మండలంతోపాటు చుట్టు పక్కల మండలాల్లో కూడా ఆయా కంపెనీలకు చెందిన విత్తనాలనే రైతులు అధికంగా వేశారని చెబుతున్నారు. ఈ లెక్కన వందల ఎకరాల్లో రైతులు తమ పెట్టుబడి ఖర్చులు నష్టపోయే పరిస్థితి ఉన్నది.
యేటా వానకాలం ప్రారంభంలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తన దుకాణాల్లో నామమాత్రంగా తనిఖీలు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని అధికారులు చేస్తున్న ప్రచారం కేవలం కాగితాలకే పరిమితమవుతున్నది. క్షేత్రస్థాయిలో పకడ్బందీ నిఘా లేకపోవడం వ్యాపారులకు వరంగా మారుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లైసెన్స్ కలిగిన విత్తన విక్రయ దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారుల నిఘా పూర్తిగా లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. మార్కెట్లోకి అనేక రకాల బ్రాండ్ల పేరిట విత్తనాలు వస్తున్నా వాటి నాణ్యతను ముందుగానే పరీక్షించడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికారుల అలసత్వాన్ని ఆసరా చేసుకుంటున్న విత్తన డీలర్లు నాసిరకం, నకిలీ విత్తనాలు అంటగడుతూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. యేటా వానకాలంలో రైతులు నకిలీ విత్తనాల బారిన పడుతూనే ఉన్నా, అధికారుల్లో చలనం రావడం లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తున్నది. తనిఖీలు సక్రమంగా నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి, బాధిత రైతులకు నష్టపరిహారం అందేలా చూడాలని కోరుతున్నారు. అలాగే నకిలీ విత్తన వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు.
భైంసా టౌన్, జూలై 4 : నేను మూడెకరాల్లో ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఆరు సోయా బ్యాగులను కొనుగోలు చేశా. ఒక్క గింజ కూడా మొలకెత్తకపోయే సరికి ఏమి చేయాలో పాలు పోవడం లేదు. ఇప్పుడు మళ్లీ కొనుగోలు చేసి సాగు చేయాలంటే.. పెట్టుబడి భారం రెండింతలు పెరిగి అప్పులపాలయ్యే అవకాశముంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి సర్వే చేపట్టి నష్టపరిహారం అందేలా చూడాలి.
– లక్ష్మణ్, రైతు, హంపోలి.
గతేడాది అధిక వర్షాలతో సోయా నష్టపోయి అప్పులపాలయ్యా. ఈ ఏడాది మంచి దిగుబడి సాధించుకుందామనే ఆశతో సాగు చేశా. నేను బేలలో ఓ వ్యాపారి వద్ద సోయా విత్తనాలు కొనుగోలు చేశా. 12 ఎకరాల్లో రెండు కంపెనీలకు చెందిన 16 సంచుల విత్తనాలు వేయగా ఒక కంపెనీకి చెందిన 10 సంచుల విత్తనాలు మొలకెత్తలేదు. వేరే కంపెనీకి చెందిన ఆరు సంచుల విత్తనాలు మొలకెత్తాయి. విత్తనాలు మొలకెత్తకపోవడంతో రూ.50 వేలకు పైగా నష్టపోయా. అధికారులు స్పందించి నకిలీ విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. నష్టపరిహారం అందేలా చూడాలి.
– మునిగేల సంతోష్, కాప్సి, బేల మండలం
భైంసా టౌన్, జూలై 4 : నేను నాకున్న రెండెకరాల్లో రెండు కంపెనీలకు చెందిన విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశా. తొలుత వర్షాలు పడ్డ తర్వాత విత్తనాలు నాటగా.. ఇప్పటివరకు మొలకెత్తలేదు. విత్తనాలు మొలకెత్తక పోవడంతో సంవత్సరమంతా మట్టితిని బతకేలా కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఇటువంటి కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక్కో బ్యాగు రూ.4 వేల చొప్పున కొనుగోలు చేశాం. దుక్కి దున్ని మందులు వేసి సాగు చేసే వరకు రూ.30 వేలకు పైనే పెట్టుబడి అయింది.
– పి.సాయినాథ్, రైతు, హంపోలి.