రఘునాథపాలెం, జూలై 4 : పేదల ఆరోగ్య భద్రతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పెద్దపీట వేసిందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గుర్తుచేశారు. శనివారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కుల పంపిణీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి 33మంది లబ్ధిదారులకు రూ.9 లక్షల విలువైన చెక్కులను తాతా మధు అందజేసి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా నిలిచాయన్నారు.
సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా వేలాది మంది పేద కుటుంబాలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిందని, ఆ ప్రభుత్వ ఆశయాలే పార్టీని ప్రజలకు మరింత చేరువ చేశాయన్నారు. కష్టకాలంలో పేదలకు అండగా నిలవడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఖమ్మంరూరల్ బీఆర్ఎస్ నాయకుడు బెల్లం వేణుగోపాల్, కనగాల వెంకటరావు, ఉప్పల వెంకటరమణ, ముత్యాల వెంకటప్పారావు, లకావత్ గిరిబాబు, పోట్ల శ్రీనివాస్, కట్టా అజయ్‌కుమార్, బలుసు మురళీకృష్ణ, యలమద్ది రవి, లింగనబోయిన సతీశ్, మహ్మద్ రఫీ, మంచానాయక్, ఇటుకల శ్రీనివాస్ పాల్గొన్నారు.