కొత్తగూడెం సింగరేణి/ ఇల్లెందు/ మణుగూరు టౌన్, జూలై 4 : అధికారుల న్యాయమైన డిమాండ్లు, సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండి వైఖరి వీడాలని సీఎంవోఏఐ నాయకులు, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం 6వ రోజుకు చేరాయి.
కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు సింగరేణి జీఎం కార్యాలయాల ఎదుట దీక్షల్లో కూర్చున్న అధికారులకు పలు పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. మణుగూరులో దీక్షలను సందర్శించి, సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు మాచారపు లక్ష్మణరావులు మాట్లాడుతూ అధికారుల న్యాయమైన సమస్యలను యాజమాన్యం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో సీఎంవోఏఐ నాయకులు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా సింగరేణి అధికారులు రోడ్డెక్కి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సంస్థ మనుగడకే ప్రమాదకరమన్నారు.
వెంటనే యాజమాన్యం చొరవ తీసుకొని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. కొత్తగూడెం దీక్షల్లో వివిధ విభాగాల అధికారులు జేజీ రాణాప్రతాప్, ప్రవీణ్‌కుమార్, మల్లికార్జున్, రవికుమార్, సందీప్, మోహన్‌బాబు, ఇల్లెందులో ఆరెం వెంకటేశ్వర్లు, కొల్లూరి నరసింహారావు, బండి రాము, వీసం కృష్ణయ్య, జి.శివప్రసాద్, మణుగూరులో విల్సన్ రాజ్, ముత్యాల సుమన్, మహ్మద్ ముజఫర్, మాడుగుల విజయ్ తదితరులు దీక్షల్లో కూర్చున్నారు. వీరికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సభ్యుడు ఊకంటి ప్రభాకర్, మాజీ జడ్పీటీసీ పోశం నరసింహారావు, ముత్యం బాబు, యాదగిరి గౌడ్, సకిని బాబురావు మద్దతు తెలిపారు.