మనిషికి తన సమర్థత గురించి విశ్వాసం ఉన్నా లేకపోయినా.. తన జాతి గురించి మాత్రం అంతులేని నమ్మకం. మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడనీ, భూమిని శాసించగలడనీ, గ్రహాలను దాటేయగలడనీ అంతులేని అభిమానం. కానీ, తను తెలిసీ మర్చిపోవాలని చూసే విషయం ఒకటి ఉంది. తన చుట్టూ ఉన్న వాతావరణం చాలా సున్నితమైన అంశాల మీద ఆధారపడి ఉంది. ఆ లెక్కలు ఏమాత్రం తప్పినా కూడా మన భవిత నరకంగా మారిపోతుంది. సముద్రపునీటి ఉష్ణోగ్రతలు ఒక్క సెంటిగ్రేడ్ పెరిగినా, ధ్రువాల దగ్గర హిమనదాలు కరగడం మొదలైనా, ఎక్కడో భూగర్భంలో ఉన్న పలకలు జరిగినా.. మన బతుకులు ఒక్కసారిగా తలకిందులైపోతాయి. అలాంటి ఓ సమస్యే ఎల్ నినో! అనుకోని అతిథిలా అప్పుడప్పుడూ మనల్ని పలకరించే ఈ ఎల్ నినో వల్ల రుతుపవనాల మీద ప్రభావం ఉంటుందనీ, వర్షపాతం తగ్గుతుందనీ మనకు తెలుసు. అయితే ఈసారి వస్తున్న ఎల్ నినో అతితీవ్రంగా ఉంటుందనే భయాలు ఉన్నాయి. అందుకే దీన్ని సూపర్ ఎల్ నినోగా పిలుస్తున్నారు. మరి కంగారుపడాల్సిందేనా!
ఇప్పటికీ మన దేశ ఆర్థికవ్యవస్థ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. దాన్ని మార్చాల్సిన అవసరం లేదు కూడా! వ్యవసాయ ఉత్పత్తులే మన కడుపు నింపుతున్నాయి, వాటి ఎగుమతులే వేల ఏళ్లుగా మన ఖజానాలు నింపుతున్నాయి. కానీ, ఒకే ఒక్క సవాలు ఏమిటంటే, ఇప్పటికీ మన వ్యవసాయ క్షేత్రాలు సగానికి పైగా వర్షాధారంగానే ఉన్నాయి. దానర్థం, ఏ ఏడాది అయినా సరిగా వానలు పడకపోతే.. పంట దిగుబడి మీదా, రైతుల జీవితాల మీదా తీవ్ర ప్రభావం ఉంటుంది. ఈ ఏడాది అలాంటి పరిస్థితి రాబోతున్నదన్నదే ఆందోళనకరం. ఇంతకీ ఎల్ నినో పరిస్థితి ఎలా వస్తుంది. రుతుపవనాల మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది?

వేసవి కాలంలో ఎండవేడికి నేల మండిపోతుంది కదా! అక్కడి గాలిలో తేమ పూర్తిగా తగ్గిపోవడం వల్ల బరువు తగ్గి కాస్త ఎత్తుకి చేరుకుంటుంది. నేల మీద ఏర్పడిన ఆ పీడనం, సముద్రపు గాలులతో మళ్లీ భర్తీ అవుతుంది. దీనికి ‘Sea Breeze’ అని పేరు. నెలల పాటు ఓ వలయంలా సాగే ఈ ప్రయాణమే రుతుపవనాలను సృష్టిస్తుంది. భూగోళంలో చాలా ప్రాంతాల్లో స్థానిక వాతావరణానికి అనుగుణంగా రుతుపవనాలు ఏర్పడుతుంటాయి. కానీ, మన దగ్గర ఏర్పడే నైరుతిది ఓ ప్రత్యేకమైన స్థితి. దేశానికి మూడు వైపులా ఉండే సముద్రం ఎప్పటికప్పుడు గాలిలోకి తేమను నింపడానికి సాయపడుతుంది.
దేశానికి నాలుగు దిక్కులా ఉన్న తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, వింధ్య, అరావళి వంటి పర్వతాలు వేడి గాలులను అడ్డుకుని అవి మరింత ఎత్తుకు చేరుకునేలా చేస్తాయి. రుతుపవనాలుగా మారిన తేమ మన దేశాన్ని దాటిపోకుండా… హిమాలయాలు అడ్డుకుంటాయి. ఒకవేళ హిమాలయాలే లేకపోతే ఈ రుతుపవనాలు దేశం నిండా అలుముకోకుండా రష్యా, అఫ్ఘనిస్తాన్లకు వెళ్లిపోతాయి. ఆఖరికి థార్ ఎడారి సైతం ఈ రుతుపవనాలకు సాయపడేదే. అక్కడ ఉత్పన్నం అయ్యే తీవ్రమైన వేడిగాలులు Sea Breeze వలయానికి సాయపడతాయి. ఈ క్రమంలో ఎక్కడ ఏ మార్పు వచ్చినా కూడా రుతుపవనాల మీద ప్రభావం పడుతుంది.
నేల, సముద్రాల మీద ఉన్న గాలులలో మార్పు మాత్రమే రుతుపవనాల సృష్టికి కీలకం అనే అభిప్రాయం ఉండేది. కానీ, ఇది ఒకానొక ముఖ్యకారణం మాత్రమే అని శాస్త్రవేత్తలు గ్రహించారు. భూగర్భరేఖ దగ్గరగా ఉండే గాలులు (Trade Winds) దిశ మార్చుకోవడం కూడా రుతుపవనాలకు దోహదం చేస్తాయి. ఒకప్పటి నావికులు ఈ ట్రేడ్ విండ్స్ దిశలోనే ప్రయాణించినప్పుడు వారి యాత్ర సజావుగా సాగిపోయేది. తమ వ్యాపారానికి సాయపడిన ఈ గాలులకి వాళ్లే Trade Winds అని పేరు పెట్టారు. ఆ గాలులు వీచే సంద్రం దగ్గరే మన విలన్ ఎల్ నినో ప్రవేశిస్తున్నది.

దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ దేశం మత్స్యసంపదకి పెట్టింది పేరు. అది స్థానికుల కడుపు నింపడమే కాదు, ఎగుమతులతో పెరూ ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచుతుంది. ఓ 500 ఏళ్ల క్రితం పెరూ మత్స్యకారులు ఓ చిత్రమైన పరిస్థితిని గమనించారు. ఒక్కోసారి క్రిస్మస్ సమయంలో అక్కడి సముద్రపు నీరు సాధారణం కంటే వెచ్చగా తోచేది. దాంతోపాటు చేపలు కూడా తగ్గిపోతుండేవి. ఈ పరిస్థితికి వారు ‘ఎల్ నినో’ అని పేరు పెట్టారు. అంటే స్పానిష్ భాషలో చిన్న బాబు అని అర్థం. జీసస్ పుట్టిన సమయంలోనే ఈ వాతావరణం ఏర్పడుతున్నదని వాళ్లు ఆ పేరు పెట్టారు. అది దైవం కాదు సాతాను అని త్వరలోనే వాళ్లకు అర్థమైంది.

సముద్రపు నీరు వెచ్చగా ఉన్న ఏడాది చేపలు తక్కువగా చిక్కేవి. పైగా పొడిగా ఉండే ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడేవి, వాటికి మట్టి పెళ్లలు విరిగిపడుతూ ఊళ్లు దిబ్బలుగా మారేవి, వర్షపు నీటికి క్రిమికీటకాలు పెరిగిపోయి వ్యాధులు ప్రబలేవి. ప్రకృతి శాపంగా భావించిన ఈ పరిస్థితి వెనకాల పసిఫిక్ సంద్రంలో Southern Oscillation అనే చర్యే కారణం అని కొన్ని వందల ఏళ్ల తర్వాతే తెలిసొచ్చింది. అందుకే దీనికి ENSO (El Ni౦oSouthern Oscillation) అనే శాస్త్రీయ నామం పెట్టారు.

పసిఫిక్ సంద్రానికి తూర్పున ఉన్న దక్షిణ అమెరికాకీ పశ్చిమాన ఉన్న ఆస్ట్రేలియాకీ మధ్యన జరిగే చర్యే ఈ Southern Oscillation. భూమధ్య రేఖ దగ్గర మెసలే Trade Winds గురించి చెప్పుకొన్నాం కదా. తూర్పు నుంచి పడమరకు వీచే ఈ గాలుల వల్ల దక్షిణ అమెరికా దగ్గర ఉన్న వేడిగాలి ఆస్ట్రేలియా వైపుగా, తిరిగి చల్లటి గాలులు దక్షిణ అమెరికా దిశగా మారతాయి. ఫలితం దక్షిణ అమెరికా తీరం చల్లబడుతూ మత్స్యసంపదకు మేలు చేస్తుంది. ఇక ఆస్ట్రేలియా చుట్టుపక్కలేమో తేమ నిండిన వేడి గాలి మబ్బులను సృష్టిస్తుంది. ఈ వలయాన్ని Walker Circulation అంటారు. నైరుతి రుతుపవనాలు బలపడేందుకు ఈ వలయం చాలా కీలకం. Walker Circulation బలహీనపడటమే ఎల్ నినో. అందుకే పసిఫిక్ సంద్రంలో ఎల్ నినో బలపడిన ప్రతిసారీ నైరుతి విఫలమవుతుంటుంది. మరీ ముఖ్యంగా నైరుతి వర్షపాతం మీదే ఎక్కువ ఆధారపడే దక్షిణ భారతం విలవిల్లాడుతుంది.
కేవలం భారతదేశం, ఆస్ట్రేలియా, పెరూ మాత్రమే ఎల్ నినో బాధితులు కాదు. ఆసియాలోని ఇండోనేసియా, మెక్సికో, ఈక్వెడార్, ఆఫ్రికా దేశాలు.. అన్నిటినీ నేరుగా ప్రభావితం చేస్తుంది. పొడిగా ఉండాల్సిన చోట వర్షాన్నీ, వాన పడాల్సిన చోట నెర్రెలని ఇస్తుంది. కార్చిచ్చుల దగ్గర్నుంచీ కరువు వరకూ దారి పొడవునా విధ్వంసం సృష్టిస్తుంది. అకాల వర్షాలు, దిగుబడిలో లోటు వల్ల అటు రవాణా ఆహార వ్యవస్థలు కూడా దెబ్బతింటాయి. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు, పోషకాహార లోపం, మురుగునీరు లాంటి ఫలితాలు నేరుగా ఆరోగ్యం మీద చూపిస్తాయి.

ఎల్ నినోకి కొన్ని సహజమైన కారణాలు ఉన్నాయి. Trade Winds అని మనం చెప్పుకొన్న గాలుల ఉధృతి తగినంత లేకపోతే వేడి గాలులు తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. ఇది క్రమంగా Southern Oscillation వలయం బలహీనపడేలా చేస్తుంది. దీనికి Bjerknes Feedback Loop అని పేరు. సముద్ర వాతావరణం మీద ఉన్న పీడనంలో మార్పులు కూడా ఎల్ నినోకి కారణం అవుతాయి. అయితే ఎప్పుడో పది, పన్నెండేళ్లకి ఓసారి కనిపించే ఈ అపసవ్యత ఇప్పుడు తీవ్రతరం కావడం వెనుక మానవ తప్పిదాలే కారణం అని భావిస్తున్నారు. అది కూడా తీవ్ర స్థాయిలో అంటే సూపర్ ఎల్ నినోగా విరుచుకుపడటం బాధాకరం.
1960లకి ముందుతో పోలిస్తే ఎల్ నినోలు పునరావృతం కావడం ఏకంగా పదిశాతం పెరిగిందని తేలింది. రాబోయే శతాబ్దంలో ఇది రెట్టింపు అవుతుందనే భయమూ ఉంది. వాతావరణంలో పెరుకుపోతున్న కర్బన వాయువు భూతాపంతో పాటుగా ఎల్ నినోకి దోహదపడుతున్నదట. రవాణా, పరిశ్రమలు, పట్టణీకరణ, విద్యుత్ తయారీ వినియోగాలు.. లాంటి సవాలక్ష చర్యలతో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. వాతావరణ పీడనాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇది కూడా ఎల్ నినోలాంటి పరిస్థితులకు దారితీసేదే! భూతాపం ఎక్కువగా ఉన్న సంవత్సరాల్లోనే ఎల్ నినోలు ఏర్పడటమే ఇందుకు సాక్ష్యం.
పట్టణీకరణ పరోక్షంగా ఎలాగూ ఎల్ నినోకి సాయపడుతున్నది. పైగా దాంతో కలిసి పనిచేయడమే మరో దురదృష్టం. కిలోమీటర్ల కొద్దీ నేలన్నదే కనిపించకుండా కాంక్రీటు నిర్మాణాలతో నడిచే పట్నాలు Urban Heat Island (UHI)కి దారితీస్తున్నాయి. అయితే విపరీతమైన ఉక్కపోత లేకపోతే ఒక్కసారిగా కుండపోత వర్షాన్ని చూపిస్తున్నాయి. అడవుల నరికివేతతో నేలను పట్టి ఉంచే చెట్ల సంఖ్య తగ్గిపోతున్నది. దాంతో పెద్ద ఎత్తు వర్షం కురిస్తే అది వరదగా మారిపోతున్నది. పచ్చదనం తగ్గినచోట కార్చిచ్చుల ప్రమాదం పెరుగుతున్నది.

అదృష్టవశాత్తు ఇప్పటి యంత్రాంగాలు కరువును ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో తగినన్ని ఆహార నిల్వలు ఉన్నాయి. కాబట్టి బియ్యానికి కటకటలాడే పరిస్థితి రానేరాదు. కానీ, నీటి ఎద్దడి, పంటల సాగు మీద కచ్చితమైన ప్రభావం ఉంటుంది. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
కరువును తట్టుకునే విత్తనాలు, భూసారాన్ని పెంచే సేంద్రియ ఎరువులు, పంటబీమా తీసుకోవడం.. అన్నీ కూడా నష్టాన్ని అదుపు చేసేవే. ఇలాంటి సమయాల్లో వ్యవసాయ అధికారుల సూచనలు చాలా ఉపయోగపడతాయి.
ఈ ఏడాది నేరేడు పండ్లు విరగకాయడం కరువుకి సూచన అనే ఆలోచన బలంగా వినిపిస్తున్నది. తగ్గుతున్న భూగర్భ జలాలను ముందుగానే పసిగట్టి కొన్ని చెట్లు ముందస్తుగా విరగకాసే ఈ Stress Fruitingలో వాస్తవం లేకపోలేదు. మొక్కలే ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు అత్యాధునిక సాంకేతికత ఉన్న మనిషి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. తన చర్యల వల్ల వాతావరణంలో వస్తున్న మార్పులను నిజాయితీగా ఒప్పుకొని దిద్దుబాటు చేసుకోవాలి. ఎల్ నినోలాంటి ఉపద్రవాలను ముందస్తుగానే పసిగట్టి రైతు నుంచి గృహిణి వరకూ ప్రతి రంగంలో ఉన్నవారికీ సన్నద్ధత కల్పించాలి.

భూమి ఏర్పడినప్పటి నుంచి పరిస్థితులు ఒకేలా లేవు. ఒక్కో సమయంలో ఒక్కో వాతావరణం, జీవరాశులు ఉండేవి. ఏదన్నా విపత్కర పరిస్థితుల్లో ఆ జీవరాశులు ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయేవి. ఇలాంటి అయిదు ముఖ్యమైన సందర్భాలను Big Five Extinction Events. వాటిల్లో ఒకటి మనకు తెలిసిందే- గ్రహశకలం ఢీ కొనడం వల్ల డైనోసార్లు అంతరించిపోవడం! ఇంతకంటే దారుణమైన సందర్భం 25 కోట్ల ఏళ్ల ముందు వచ్చింది. మూడొంతులకు పైగా జీవజాతులను నాశనం చేసేసింది. అందుకే దీనికి The Great Dying అని పేరు. ఈ అంతానికి దారితీసిన ముఖ్య కారణాల్లో ఒకటి అప్పట్లో ఏర్పడిన ఎల్ నినో అని శాస్త్రవేత్తల అంచనా. నేరుగా కాకపోయినా నాటి ఎల్ నినో ప్రతికూల వాతావరణాన్ని మరింతగా దిగజార్చి మరణశాసనం రాసిందని చెబుతారు. అంత దారుణమైన పరిస్థితులు మళ్లీ రాకపోవచ్చు. కానీ ఎల్ నినో ఎంత ప్రమాదకరమైనదో, దానికి సన్నద్ధంగా లేకపోతే ఎంత తీవ్ర పరిణామాలకు దారితీస్తుందో గుర్తుంచుకుని తీరాలి.

రుతుపవనాలను దెబ్బతీస్తుంది కాబట్టి మనం ఎల్ నినో గురించి ఎక్కువగా కంగారుపడుతుంటాం. కానీ, ఇందుకు విరుద్ధమైన చర్య కూడా ఒకటి ఉంది. అదే ‘లా నినా’. తూర్పు నుంచి పడమరకు వీచే సముద్రగాలులు (Trade Winds) మరీ బలంగా ఉండి.. ఎక్కువ వేడి గాలులను ఆస్ట్రేలియా వైపు, మరింత చల్లటి గాలులను దక్షిణ అమెరికా వైపు బదలాయిస్తుంటే అదే లా నినా. దానివల్ల పెరూ వంటి దేశాలు మరింత చల్లదనాన్నీ, ఇండియా బలమైన రుతుపవనాల్ని అందుకుంటాయి. అవసరానికి మించిన వర్షపాతంతో వరదలు ముంచుకొస్తాయి, బంగాళాఖాతంలో తరచూ వాయుగుండాలు ఏర్పడతాయి, ఉత్తరాది చలితో గజగజలాడుతుంది, ఢిల్లీలో కనిపించినట్టుగా గాలిలో కాలుష్యం నిలబడిపోతుంది (SMOG), వర్షపు నీటిని ఎక్కడికక్కడ దారి మళ్లించలేకపోతే పంటలు నీటమునుగుతాయి. దురదృష్టవశాత్తు ఎల్ నినో లాగానే లా నినా కూడా తరచుగానే విరుచుకుపడుతున్నది. గత ఏడాది విపరీత వర్షాలు దీని ప్రభావమే. ఇంతలోనే అందుకు విరుద్ధమైన ఎల్ నినో ఈ ఏడాది వచ్చేసింది.

పసిఫిక్ సంద్రంలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే కనుక దాన్ని సూపర్ ఎల్ నినోగా భావిస్తుంటారు. రెండు డిగ్రీల పెరుగుదల అన్నది విన్నంత తేలిక కాదు. సున్నితమైన వాతావరణం మీద దాని ప్రభావం ప్రాణాంతకం. అది కేవలం పంటలకే పరిమితం కాదు. నేల మీదా నీటిలోను ఉండే వేలాది జీవజాతులకు శాపంగా మారుతుంది. దురదృష్టవశాత్తు ఈ ఎల్ నినో మరింత తరచుగా, మరింత ఉధృతంగా విరుచుకుపడుతున్నది. 1950 తర్వాత ఏకంగా పదహారుసార్లు ఎల్ నినో వస్తే, అందులో కనీసం తొమ్మిదిసార్లు దాని ప్రభావం తీవ్రంగా ఉంది. ఓ నాలుగు సార్లు సూపర్ ఎల్ నినో స్థాయిలో ఉంది. ఈసారి రాబోయే ఎల్ నినో కూడా తీవ్రస్థాయిలో ఉంటుందని భయాలు వ్యక్తమవుతున్నాయి!

1877-1878 సంవత్సరాన్ని చరిత్రకారులు ఎప్పటికీ మర్చిపోరు. అధికారిక అంచనాల ప్రకారమే ఆ సమయంలో వచ్చిన కరువు అయిదు కోట్లమందిని బలిగొంది. అంటే నాటి జనాభాలో దాదాపు నాలుగు శాతం! ఈ కరువుకు కారణమైన ఎల్ నినో వల్ల ఇండియా, చైనా, బ్రెజిల్ దేశాలు ఆకలితో మాడిపోయాయి. ఆ ఏడాది ఓ సూపర్ ఎల్ నినో వచ్చిన మాట వాస్తవమే. కానీ, అంతకంటే క్రూరమైన బ్రిటిషర్ల పాలనే అన్నపూర్ణలాంటి దేశాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది.
ఈ కరువు సందర్భంగా బ్రిటిషర్ల రాక్షసత్వం చూసిన ఏ.వో.హ్యూమ్, దాదాభాయ్ నౌరోజీ వంటివారిలో స్వతంత్రకాంక్షను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే తపన మొదలైంది. బ్రిటిషర్లు మనకు కీడుకంటే మేలే ఎక్కువ చేశారు అనే అభిప్రాయం ఉంటే… వారి క్రూరత్వాన్ని చాటే ఇలాంటి సందర్భాలెన్నో కనిపిస్తాయి. కేవలం ఈ 1877నాటి కరువే కాదు, బ్రిటిషర్ల నిర్లక్ష్యం వల్ల సాధారణ వర్షాభావ పరిస్థితులు తీవ్రమైన కరువుగా మారిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. 1770, 1877, 1899, 1943 ప్రాంతాల్లో సాగిన కరువుతో కోట్లమంది చనిపోయారు.