హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 44వేల మందికి పైగా జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో అక్రెడిటేషన్ కార్డుల జారీ విధానం, కమిటీ ఏర్పాటుపై సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీఎం సీపీఆర్వో జీ మల్సూర్తో సుదీర్ఘంగా చర్చించారు.
అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం ముందుగా జీవో 252 జారీ చేసినట్టు మంత్రి తెలిపారు. అనంతరం జర్నలిస్ట్ సంఘాలతో సమావేశమై వారి సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని సవరణలు చేసి జీవో 103ను జారీ చేసినట్టు వెల్లడించారు. ఈ సవరణల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా విభాగాల్లో మొత్తం 44,706 అక్రెడిటేషన్ కార్డులు పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.
2.50 లక్షలకు పైగా సర్యులేషన్ ఉన్న 8 పత్రికలకు 6,256 కార్డులు, 75 వేల నుంచి 2.50 లక్షల వరకు సర్యులేషన్ ఉన్న24 పత్రికలకు 17,784 కార్డులు, 25001 నుంచి 75 వేల వరకు సర్యులేషన్ ఉన్న 30 పత్రికలకు 3,390, అదే విధంగా 15001 నుంచి 25000 వరకు సర్యులేషన్ ఉన్న 169 చిన్న పత్రికలకు 11,661 , 15వేలలోపు సర్యులేషన్ ఉన్న 113 చిన్న పత్రికలకు 226, పీరియాడికల్స్‌కు 624, 20 న్యూస్ ఏజెన్సీలకు 68 అక్రెడిటేషన్లు పొందుతాయని తెలిపారు.
అలాగే 21 శాటిలైట్ చానళ్లకు 4,431 కార్డులు, 8 జాతీయ చానల్స్‌కు 32, వంద లోకల్ కేబుల్ చానళ్లకు 200, డిజిటల్ మీడియా విభాగానికి 10 కార్డులు మొత్తంగా 44,706 కార్డులు కేటాయించినట్టు తెలిపారు. ఇందులో రాష్ట్ర, జిల్లా స్థాయిలో 16,056, నియోజకవర్గ, మండలస్థాయిలో 28,650 మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. అక్రెడిటేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి తెలిపారు.
పాత జీవో ప్రకారమే జర్నలిస్టులకు
జర్నలిస్టులకు పాత జీవో ప్రకారమే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చినట్టు టీయూడబ్ల్యూజే నేతలు, కేబుల్ చానెల్స్ జర్నలిస్టుల జేఏసీ నాయకులు తెలిపారు. కేబుల్ చానల్స్‌కు అక్రెడిటేషన్స్ జారీ విషయంలో అన్యాయం జరిగిన విషయాన్ని వారు మంత్రికి వివరించారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్, తెంజు ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, సిటీ కేబుల్ ఎండీ శివరామకృష్ణ, ఎంఎస్‌వో సంఘం నాయకులు వంగా శ్రీనివాస్‌రెడ్డి, కేబుల్ చానెల్స్ జేఏసీ నాయకులు కే వెంకటేశ్, హెచ్వీ చలపతి, దేవేందర్, అరవింద్, బ్రహ్మం, రాజేశ్ పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా డెస్క్‌జర్నలిస్టులకు ఇచ్చే అక్రెడిటేషన్ల సంఖ్యను పెంచాలని డీజేఎఫ్టీ నాయకులు డిమాండ్ చేశారు. సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత ప్రక్రియ ద్వారా పెద్ద సంఖ్యలో కార్డుల్లో కోత ఏర్పడిందని మంత్రితో పాటు ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక దృష్టికి డీజేఎఫ్టీ అధ్యక్షుడు ఉపేందర్ తీసుకెళ్లారు. ఈ విషయంలో మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ఆయన పేర్కొన్నారు. డీజేఎఫ్టీ ప్రతినిధులు డీ రాజారాం, కే రమేశ్, జీ సత్యప్రసాద్ ఉన్నారు.