గజ్వేల్, సెప్టెంబర్ 26: భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వర్షం నీళ్లు పుష్కలంగా చేరడంతో అలుగులు పారుతున్నాయి. భారీ వర్షాలకు పలు చెరువులు ప్రమాదకరంగా మారా యి. మరమ్మతులు చేయాల్సిన అధికారులు స్పందించకపోవడంతో రైతులే చందాలు వేసుకొని చెరువు కట్టపై కుంగిన ప్రదేశాన్ని పూడ్చుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని పిడిచేడ్ గ్రామ లక్ష్మీదేవి చెరువు భారీ వర్షాలకు నెల క్రితం నిండడంతో అలుగు పారుతున్నది.
చెరువుకట్ట మధ్యలో నెర్రలు భారడంతో అప్రమత్తమైన చెరువు కింది రైతులు వెంటనే ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదకరంగా మారిన ప్రదేశం లో ఇటీవల అధికారులు మట్టి వేయించారు. రోజు కురుస్తున్న భారీ వర్షాలతో మట్టి వేసిన ప్రదేశంలో చెరువు కట్ట కుంగి ప్రమాదకరంగా మారుతుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం రైతులంతా ఏకమై ఎకరానికి రూ.1000 చొప్పున చందా లు వేసుకొని చెరువుకట్టపై కుంగిన ప్రదేశాన్ని నల్లమట్టితో నింపారు.
చెరువు కింద సుమారుగా 300ఎకరాల్లో వరిసాగు చేశామని, కట్ట తెగితే వంద మంది రైతులు సాగు చేసిన పంట చేతికందకుండా పోతుందని, అందుకు చందా లు వేసుకొని కట్టపై మరమ్మతులు చేపడుతున్నట్లు రైతులు తెలిపారు. చెరువు మరమ్మతులు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడినా స్పందన రావడం లేదని మాజీ జడ్పీటీసీ పంగ మల్లేశం తెలిపారు. కుంగిన చెరువుకట్ట ప్రదేశాన్ని శుక్రవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు.
మా పొలం చెరువు కిందనే ఉంది. చెరువు కట్ట రోజు రోజుకు కుంగుతున్నది. మట్టి పోసిన ప్రదేశంలోనే కట్ట చాలా కుంగింది. సొంతంగా రైతులం చందాలు వేసుకొని ట్రాక్టర్ల ద్వారా మట్టి పోసుకుంటున్నాం. అధికారులకు చెప్పన ఎవ్వరూ ఇక్కడికి రాలేదు, చూడలేదు. వంద మంది రైతుల వరిపంట ఆగమైతదనే భయంతో మేమే సొంతంగా పనులు చేసుకుంటున్నాం.
– కిష్టయ్య, రైతు, పిడిచేడ్
మా లక్ష్మీదేవి చెరువుకట్ట తెగితే నీళ్లన్నీ మా పక్క ఊరు అహ్మదీపూర్ పెద్ద చెరువులోకి పోతాయి. నీళ్లన్నీ పోతే ఆ కట్ట కూడా తెగుతదని అధికారులకు చెప్పాం. రోజురోజుకు చెరువుకట్ట కుంగుతున్నది. ఎలాంటి మట్టి పోసినా ప్రయోజనం ఉండడం లేదు. రైతులం ఎకరానికి వెయ్యి రూపాయలు వేసుకొని మట్టి పోయిస్తున్నాం.
– లీలా కరుణాకర్, రైతు, పిడిచేడ్