kidnapping case | వినాయక నగర్, ఏప్రిల్ 10 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన బాలిక ఆచూకీ లభ్యమైంది. జిల్లా కేంద్రంలో కిడ్నాప్ కు గురైన బాలికను నిందితుడు కామారెడ్డి జిల్లాలోని తన ఇంట్లో ఉంచినట్లు గుర్తించిన పోలీసులు బాలికను సురక్షితంగా తల్లి చెంతకు చేర్చారు.
నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతానికి చెందిన మూడేళ్ల చిన్నారి రమ్య, తన అమ్మమ్మతో కలిసి ఈనెల 7న రాత్రి నిజామాబాద్ నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో నిదురిచ్చింది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడు. ఈ ఘటనపై బాలిక తల్లి శిరీష ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కేసు నమోదు చేసిన ఎస్ హెచ్ ఓ రఘుపతి ప్రత్యేక బృందాలతో బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇందులో భాగంగా బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడు ఆమెను కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని మిర్జాపూర్ గ్రామంలోని తన తమ్ముడి ఇంట్లో ఉంచి అక్కడినుండి పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. సాంకేతిక ఆధారాల ద్వారా బాలిక ఆచూకీ గుర్తించిన పోలీసులు, బాలాజీ అనే నిందితుడు బాలికను నిజాంబాద్ జిల్లా కేంద్రం నుండి కిడ్నాప్ చేసినట్లుగా గుర్తించారు.
బాలికను సురక్షితంగా తల్లి చెంతకు చేర్చిన పోలీసులు, పరాలిలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక కిడ్నాప్ కేసును చేదించిన ఎస్ హెచ్ ఓ రఘుపతి తో పాటు సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో పాటు ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి తదితరులు అభినందించారు.