Swaantana Sabha | ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (FATHI) ఆధ్వర్యంలో ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన స్వాంతన మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సరూర్‌నగర్, ఉప్పల్, పరేడ్‌గ్రౌండ్ మైదానాల్లోనూ సభలకు అనుమతి నిరాకరించగా.. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలను అనుమతించడం లేదని.. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు తెలిపింది.
దీనిపై సమాఖ్య ఈసీ మెంబర్స్ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఉదయం హైకోర్టు ఈ అంశంపై అత్యవసర విచారణ జరుపనున్నది. ఎల్బీ స్టేడియంలో కాకపోతే సికింద్రాబాద్, ఉప్పల్, సరూర్‌నగర్ స్టేడియాల్లో సభను నిర్వహించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరగా.. అనుమతి నిరాకరించారు. 8వ తేదీన అధ్యాపకుల స్వాంతన సభను బండ్లగూడలోని అరోరా ఇంజినీరింగ్ క్యాంపస్‌కి మార్చాలని నిర్ణయించారు. శుక్రవారం హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి మహాసభను ఎక్కడ నిర్వహించాలనేది ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నిర్ణయించనున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నెల 11న తలపెట్టిన విద్యార్థుల మహార్యాలీని 15వ తేదీకి వాయిదా వేసినట్లు ఈసీ కోర్ కమిటీ సభ్యులు వెల్లడించారు.