హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/చిక్కడపల్లి : కనీస వేతనం 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఆశావర్కర్లను పోలీసులు వెంటాడి.. వేటాడి.. అరెస్టు చేశారు. పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం సాక్షిగా.. ఈ దమనకాండకు రేవంత్ సర్కార్ పోలీసులను ఉసిగొల్పింది. నారాయణగూడ, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, బర్కత్‌పుర, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో భారీగా మోహరించిన పోలీసులు.. ఆశావర్కర్లను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆశా వర్కర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినదించారు. సీఎం డౌన్.. డౌన్, ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం.. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ చేసిన ఆశావర్కర్ల నినాదాలు మిన్నంటాయి. అదుపులోకి తీసుకున్నవారిని వ్యాన్లలో కుక్కిపడేశారు. వారిపై మగ పో లీసులు బూతులతో రెచ్చిపోయారు. పోలీసుల కర్కశవైఖరికి కొందరు ఆశావర్కర్లు గాయపడ్డారు. ప్రభుత్వ కుట్రలను చేధిస్తూ.. 5 వేల మంది ఆశావర్కర్లు అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చారు.
బీఆర్టీయూకు అనుబంధంగా ఉన్న ఆశావర్కర్లు.. దాదాపు 15వేల మంది హైదరాబాద్‌కు రావాలని నిర్ణయించారు. విషయాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించిన ప్రభుత్వం, అసెంబ్లీ నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు దాదాపు 2వేల మంది పోలీసులతో మోహరించా రు. అంతకుమందు అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసి, వేలాది మంది ని ముందస్తుగా అరెస్టు చేశారు. అయినప్పటికీ వేలాదిగా వస్తున్న వారిని అసెంబ్లీవైపు వెళ్లకుండా దాదాపు 1,800 మందిని అరెస్టు చేసి నగరంలోని 9 పోలీస్స్టేషన్లలో నిర్భందించినట్టు బీఆర్టీయూ నాయకులు చెప్పారు. డీసీపీకి వినతిపత్రం సమర్పించినా ఉద్దేశపూర్వకంగా అనుమతి నిరాకరించడమేందని బీఆర్టీయూ నాయకులు ప్రశ్నించారు. ‘హామీలు అమలు చెయ్.. లేదంటే గద్దె దిగు రేవంత్!’ అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ఆశా కార్యకర్తలకు రూ.18 వేల వేతనం ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సమాజ ఆరోగ్య పరిరక్షణలో కీలకభూమిక పోషిస్తున్న వారి సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చే యడం ఎంతవరకు సమంజసమని శుక్రవారం ప్రకటనలో ప్రశ్నించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆశా కార్యకర్తల కృషిని గుర్తించి సముచిత ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. వారిని ప్రగతిభవన్‌కు పిలిపించి కలిసి భోజనం చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారని గుర్తుచేశారు. రేవంత్ సర్కార్ వారికిచ్చిన హామీల అమల్లో నిర్లక్ష్యం చూపుతున్నద ని ధ్వజమెత్తారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అడిగిన వారిని అరెస్టు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఆశా కార్యకర్తల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.