అచ్చంపేట : నల్లమలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిర్వహించిన ఆదివాసుల సభకు ఆదివాసి నాయకులు వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు (Tribal leaders Arrest ) చేయడం పట్ల సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసుల కోసం ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి నాగర్కర్నూల్( Nagarkarnool) జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారం ( Macharam) గ్రామంలో సోమవారం పర్యటించారు.
ఈ సంర్భంగా అమ్రాబాద్ మండలం సార్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్, చెంచు ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ చిగుర్ల మల్లికార్జున్, వీటీడీఏ అధ్యక్షుడు గురువయ్యను సోమవారం అమ్రాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఆదివాసుల సభకు వెళ్లకుండా ఆదివాసులనే అడ్డుకుని అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. చెంచు సమాజ హక్కుల కోసం శాంతియుతంగా ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వాలని అనుకుంటే ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆరోపించారు.
ప్రభుత్వం స్పందించకపోతే, మరో పాదయాత్ర చేపట్టి అన్ని సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించారు. మన్ననూరులో ఉన్న ఐటీడీఏ కు ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలని, అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు ప్రయాణించే చెంచు గిరిజనుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక అధికారిని నియమించి, వారి వైద్య ఖర్చులను ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చెంచు బాలబాలికల కోసం సంవత్సరానికి 30 సీట్లు పెంచి, హైదరాబాదులోని టాప్ 10 పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలని, వందకు పైగా ఉన్న చెంచు గూడెం, గ్రామాలు, పెంటలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని కోరారు.