న్యూఢిల్లీ, జూన్ 28: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి(ఐఎస్ఎస్) ప్రవేశించిన తొలి భారతీయునిగా గురువారం చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లాతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ముచ్చటించారు. ‘మీ మాతృభూమి నుంచి నేడు మీరు చాలా దూరంలో ఉన్నారు. కాని భారతీయుల హృదయాలకు అత్యంత చేరువలో ఉన్నారు. మీ పేరులో కూడా శుభం ఉంది. అంతేగాక మీ యాత్ర నవ యుగానికి శుభారంభం కూడా’ అని శుభాన్షుతో మోదీ వ్యాఖ్యానించారు. దీనికి శుభాన్షు జవాబిస్తూ తన కొత్త అనుభవాలను గుండెల్లో పదిలపరుచుకుంటున్నానని తెలిపారు. ఇప్పటివరకు అంతరిక్షంలో ఏం చూశారో వర్ణించాలని ప్రధాని కోరగా కొద్ది సేపటి క్రితం కిటికీలో నుంచి చూస్తుండగా తాము హవాయీపైన ఎగురుతున్నామని, ఇప్పటి వరకు తాము కక్ష్య నుంచి 16 సూర్యోదయాలు, 16 సూర్యాస్తమయాలు చూశామని శుభాన్షు తెలిపారు.
మన దేశం వేగంగా ముందుకు కదులుతోందని ఆయన చెప్పారు. ఇక్కడ ప్రతీది భిన్నంగా ఉందని ఆయన అన్నారు. ‘ఏడాదిపాటు శిక్షణ పొంది అనేక విషయాలు నేర్చుకున్నాం. కాని ఇక్కడకు వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి. అంతరిక్షంలో ఆకర్షణ శక్తి లేని కారణంగా చిన్న వస్తువులు కూడా భిన్నంగా ఉన్నాయి. వాతావరణానికి అలవాటుపడేందుకు కొంత సమయం పడుతుంది’ అని ఆయన ప్రధానికి వివరించారు. అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత మీకొచ్చిన మొదటి ఆలోచన ఏమిటి అని ప్రధాని ప్రశ్నించగా సరిహద్దులేవీ కనిపించలేదు అని శుభాన్షు జవాబిచ్చారు.