ఢిల్లీ ,మే 30: దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి పిల్లల సాధికారత కోసం ‘పీఎం కేర్స్’ కింద ప్రకటించిన చర్యలకు అదనంగా కోవిడ్ వల్ల పోషకులను కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలను ప్రకటించింది. అందులో భాగంగా ఆయా కుటుంబాలకు పెన్షన్ చెల్లింపుసహా బీమా పథకం కింద నష్టపరిహారాన్ని పెంచడమే కాకుండా ఈ ప్రక్రియను సరళీకృతం చేసింది. మహమ్మారివల్ల సంపాదించే వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం మద్దతు ప్రకటిస్తున్నదని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ చెప్పారు. ఆర్థికంగా కష్టలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ పథకాల ద్వారా ఊరటనివ్వడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.