హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జిల్లాలవారీగా పారిశ్రామికవాడలను అభివృద్ధి చేసిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ) ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సాదరంగా ఆహ్వానిస్తున్నది. ఇలాంటివారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటు కేవలం హైదరాబాద్, చుట్టుపక్క ప్రాంతాలకే పరిమితం కాకుండా మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతో టీఎస్ఐఐసీ జిల్లాల్లో పారిశ్రామికవాడలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములతోపాటు కొన్నిచోట్ల ప్రైవేటు భూములను సేకరించి రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, నీటి లైన్లు తదితర అన్ని రకాల మౌలిక సదుపాయాలతో లేఔట్లను అభివృద్ధి చేసింది. జిల్లాల్లో వీటి కనీస ధరను చదరపు మీటరుకు రూ. 1000గా ఖరారు చేసింది. ఖమ్మం జిల్లా లో రూ.993, కరీంనగర్లో రూ.1,600, మేడ్చల్-సిద్దిపేట జోన్లో రూ.1500, వరంగల్‌లో రూ.1,800, నిజామాబాద్‌లో రూ.2,500, యాదాద్రిలో రూ. 4,300 కనిష్ఠ ధరలతో ప్లాట్లు అందుబాటులో ఉన్నట్టు టీఎస్ఐఐసీ అధికారులు వెల్లడించారు. శంషాబాద్‌లో రూ. 1,400, సైబరాబాద్ జోన్ పరిధిలో సైతం రూ.1,600, పటాన్చెరులో రూ. 1,900 ధరతో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటి కేటాయింపు పూర్తికాగానే యూనిట్ల ఏర్పాటుకు అన్నిరకాల అనుమతులు, రాయితీలు సునాయాసంగా లభిస్తాయని చెప్పారు.
చిక్కుల్లేని ప్లాట్లు
సొంతగా భూమిని కొనుగోలు చేసుకొని పరిశ్రమలు నెలకొల్పానుకునేవారు మౌలిక సదుపాయాలకు కూడా సొంత నిధులతోనే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన భూమి పరిశ్రమకు అనువైనదో, కాదో సరిచూసుకోవాలి. టైటిల్ డీడ్‌లో సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ఊరికి దగ్గరగా ఉంటే బఫర్ జోన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. టీఎస్ ఐపాస్ ద్వారా త్వరగా అనుమతులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ నిబంధనలకు లోబడి ఉంటేనే సాధ్యమవుతుంది. అదే టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసిన లేఔట్లలో అయితే ఇలాంటి సమస్యలేమీ ఉండవు.