Tariff War | (స్పెషల్ టాస్క్ బ్యూరో) ; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ భారత్‌పై పరస్పర సుంకాలు విధిస్తామని ప్రకటిస్తుండటంతో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని హడావుడిగా అమెరికాకు బయల్దేరారు. ఇటు గోయల్ అగ్రరాజ్యానికి చేరుకొన్నారో లేదో ఏప్రిల్ 2 నుంచి ప్రతీకార సుంకాలే అంటూ వైట్‌హౌజ్ సాక్షిగా ప్రకటించేశారు ట్రంప్. దీంతో అక్కడి వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్, ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్‌తో సమావేశానికి గోయల్ సిద్ధమవుతున్నారు.
సుంకాల ప్రభావం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చించే వీలున్నట్టు తెలుస్తున్నది. కెనడా, మెక్సికోలపై విధించిన సుంకాలను తగ్గించే అవకాశాలున్నట్టు లుత్నిక్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడంతో కొద్దిరోజులు అక్కడే ఉండైనా టారిఫ్‌ల అంశాన్ని ఓ కొలిక్కి తేవాలని చూస్తున్నట్టు చెప్తున్నారు. కాగా, అమెరికాను శాంతింపజేయడానికి అక్కడి నుంచి దిగుమతయ్యే హై-ఎండ్ మోటర్ సైకిల్స్‌పై 20 శాతం, బోర్బన్ విస్కీ టారిఫ్‌లను 50 శాతం మేర భారత్ తగ్గించింది. ఇతర టారిఫ్‌లను సమీక్షించడంతోపాటు రక్షణ పరికరాలను అగ్రరాజ్యం నుంచి కొనుగోలు చేస్తామన్న హామీని కూడా ఇచ్చింది. అయినప్పటికీ టారిఫ్‌ల విషయంలో ట్రంప్ దూకుడుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే గోయల్ అమెరికా బాట పట్టారు. ఇక అమెరికా సుంకాల వల్ల భారత్‌కు ఏటా 7 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లవచ్చన్న అంచ నాలు వినిపిస్తున్నాయి.