హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ప్రయాణం మరింత సురక్షితం కానున్నది. ఒంటరిగా ప్రయాణించే మహిళలు, చిన్నారులతో ప్రయాణించే వారికి అత్యవసరంలో అవసరమైన ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్ఆర్టీసీ ప్రయోగాత్మకంగా ‘మై బస్ ఈజ్ సేఫ్’ పేరిట క్యూఆర్ కోడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తొలుత వీటిని రాష్ట్రవ్యాప్తంగా 40 బస్సుల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ పోస్టర్‌తో పాటు ఆ బస్సు నంబర్, డయల్ 100, సంబంధిత ఆర్టీసీ అధికారి నంబర్‌ను అందుబాటులో ఉంచారు.
క్యూఆర్ కోడ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని, ఎలా స్కాన్ చేయాలన్న వివరాలను కూడా తెలుగులో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పైలట్ ప్రాజెక్టునకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవలే శ్రీకారం చుట్టారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పోలీస్ అధికారుల నంబర్లతోపాటు, ఇతర ముఖ్యమైన ఫోన్ నంబర్లన్నీ కనిపిస్తాయి. ఆ క్యూఆర్ కోడ్‌ను ఫొటో తీసి కుటుంబసభ్యులకు పంపినా, వారు కూడా బస్సు వివరాలు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. చుట్టూ పరిస్థితులను ఫొటోలు, వీడియోల రూపంలోనూ అందులో అప్డేట్ చేయవచ్చు.
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సమయంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఒంటరిగా ఉన్నా, పిల్లలతో వెళ్తున్నా సురక్షితంగా ఉండేందుకు ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చాం. ముందుగా 40 బస్సుల్లో దీన్ని ఏర్పాటు చేశాం. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా పోలీస్ అధికారి కావడంతో మరింత సురక్షితమైన చర్యలు తీసుకొంటున్నారు. ప్రయాణ సమయంలో అభద్రతా భావం కలిగితే క్యూఆర్ కోడ్ ద్వారా అత్యవసర సేవలు పొందవచ్చు.
– పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ మంత్రి