సిద్దిపేట, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్లు బంద్ పెట్టి.. బీరు కంపెనీలకు మాత్రం నీళ్లు ఫుల్‌గా ఇస్తరా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. సాగునీరు లేక మెదక్ జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని అన్నారు. సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలు, ఘనపురం ప్రాజెక్టు కింద 30 వేల ఎకరాలు.. మొత్తం 70 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారని, కారణం అడిగితే రిపేర్లు ఉన్నాయి.. నీళ్లు లేవంటున్నారని మండిపడ్డారు. రైతుల నోట్లో మట్టికొట్టి.. బీరు కంపెనీలకు నీళ్లిస్తారా? రైతులకు ఇవ్వడానికి లేని నీళ్లు బీరు కంపెనీలకు ఎకడి నుంచి వస్తున్నాయి? అని నిలదీశారు.
‘ఎక్సైజ్ శాఖ కార్యదర్శి స్వయంగా వచ్చి బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఆపొద్దు. ఫుల్‌గా ఇవ్వండి అని ఆదేశాలు ఇస్తున్నారు. మీకు రైతుల కంటే బీరు కంపెనీల ఓనర్లు ఇచ్చే లంచాలు, కమీషన్లే ముఖ్యమా? రైతులు లంచాలు ఇవ్వరని వారి పంటలను ఎండబెడతారా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మారెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుకుపోతున్నదని అన్నారు. రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఆయన ఖండించారు. ఎరువుల కోసం మళ్లీ చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు.
బీజేపీ ప్రభుత్వం సబ్సిడీలకు కోత పెట్టాలని ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా పంపిణీలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ ఎరువుల కొరత రాలేదని చెప్పారు. కరోనా వచ్చినా, నోట్లు రద్దయినా రైతులకు ఇబ్బందులు రాకుండా చూశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలన వచ్చాక ఎరువుల కోసం తెల్లవారుజామున 3 గంటలకు రైతులు వచ్చి క్యూలో చెప్పులు పెట్టి నిలబడే చీకటి రోజులు వచ్చాయని ఆవేదన వ్యక్తంచేశారు. యూరియా దొరక రైతులు ప్రైవేట్‌లో అధిక ధరలకు లిక్విడ్ ఎరువులు కొంటూ నష్టపోతున్నారని తెలిపారు.
ఫిబ్రవరి వస్తున్నా రైతుభరోసా డబ్బులు వేయడం లేదని హరీశ్‌రావు అన్నారు. యాసంగి సాగు పనులు కొసాగుతున్నాయని, దుకి దున్ని, నాట్లు వేసి, కలుపు తీసి ఎరువులు వేయాల్సిన సమయంలోనూ పెట్టుబడి సాయం అందలేదని ఆరోపించారు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లోనే రైతుబంధు టింగ్ టింగ్‌మని ఫోన్లలో మోగేదని అన్నారు. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశానిర్దేశం లేదని ధ్వజమెత్తారు. రైతు భరోసా ఎప్పుడు వేస్తారు? ఎంత వేస్తారు? 15 వేలా? 12 వేలా? ఎన్ని ఎకరాలకు ఇస్తారు? అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఎప్పు డూ క్రాప్ హాలిడే ఇవ్వలేదని అన్నారు. సర్కార్‌కు బీరు కంపెనీలపై ఉన్న ప్రేమ రైతుల మీద లేదని దుయ్యబట్టారు.
గత వానకాలంలో వడగండ్లతో పంట నష్టపోతే, సీఎం రేవంత్ హెలిక్యాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని చెప్పారని, ఇంతవరకు పైసా రాలేదని హరీశ్ విమర్శించారు. మొన్నటి తుపాన్ నష్టానికీ పరిహారం ఇవ్వలేదని తెలిపారు. బోనస్ పైసలు సగం మందికే ఇచ్చారని, మిగతా రైతులకు దికులేదని మండిపడ్డారు. పోయిన యాసంగి సన్నాల బోనస్ రూ. 1,100 కోట్లు పెండింగ్ ఉన్నదని, సివిల్ సప్లయ్, వ్యవసాయ, ఆర్థిక మంత్రులకు చివరికి సీఎంకూ రైతుల గోడు పట్టడం లేదని విమర్శించారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, సిట్ నోటీసులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని ధ్వజమెత్తారు. తక్షణమే రాజకీయ కక్ష సాధింపులు ఆపి, పెండింగ్ రైతుబంధు, బోనస్ డబ్బులు చెల్లించాలని, వడగండ్ల వాన, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.