హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎమ్మెస్సీ సైకాలజీ సప్లిమెంటరీ పరీక్షలో గందరగోళం నెలకొన్నది. ప్రశ్నపత్రంపై ఎమ్మెస్సీ సైకాలజీకి బదులు ఎంఏ సైకాలజీ అని ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. దీంతో యూనివర్సిటీ అధికారులకు సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
ప్రశ్నపత్రాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు సబ్జెక్టుకు సంబంధించి ముద్రణలో తప్పు దొర్లిందని గుర్తించారు. వెంటనే అన్ని కేంద్రాలకు సమాచారం అందించి, పరీక్ష సజావుగా సాగేలా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇదే విషయమై అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయకృష్ణారెడ్డి స్పందించారు. ముద్రణలో తప్పిదం వల్లే జరిగిందని తెలిపారు. హైదరాబాద్లోని ఓ సెంటర్ వద్ద కొంత మంది ప్యాడ్లు తీసుకురాగా అనుమతించలేదు. మరికొన్ని సెంటర్లలో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగినట్టు తెలిసింది.