బీజేపీ, కాంగ్రెస్ ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొన్నప్పుడల్లా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. టీవీ సీరియల్ తరహాలో బీఆర్ఎస్ నాయకులకు సిట్ నోటీసులు ఇవ్వడం పరిపాటిగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ మంత్రుల సింగరేణి అక్రమాలను కప్పిపుచ్చుకొనేందుకు సిట్ నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం ఏ మాత్రం సరికాదని హితవు పలికారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారని, మరి వారికెందుకు నోటీసులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ నోటీసుల తతంగం అని విమర్శించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాడర్ను డైవర్ట్ చేయాలని, ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ నోటీసులకు ఎవరూ భయపడేది లేదని తేల్చిచెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెబుతారని, భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్ భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఇచ్చిన నోటీసులు తెలంగాణ సమాజానికి ఇచ్చిన నోటీసులుగానే భావిస్తామని చెప్పారు. కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలు మానుకోవాలని, హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
వర్ధన్నపేట, జనవరి 29: ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవాలనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, బీఆర్ఎస్ నేతలకు సిట్ ద్వారా నోటీసులు ఇస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.

ప్రజల్లో ఆదరణ పోతుండటంతో వారి దృష్టిని మళ్ల్లించేందుకే రేవంత్రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నదని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో అర్థంలేని నోటీసులు ఇస్తున్నదని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి దుర్మార్గపు పాలనను ప్రజలు అర్థం చేసుకొని వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.