‘దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో ఉండి పోరాటం చేసినం. ఇవ్వాళ తినబోయే ముందు వేరేవాళ్లు వచ్చి కంచం గుంజుకున్నట్టు ఉన్నది మా పరిస్థితి.. మా పని అయిపోయింది. ఇక రాజ్యం ఏలండి’ ఆవేదనతో ఓ అసలు కాంగ్రెస్ నేత గుండెలోతుల్లోంచి పెల్లుబికిన మాటలివి!
‘నేను ఎప్పటికైనా తెలంగాణకు సీఎం అవుతా! రాసుకోండి’ అని చెప్పిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత.. ‘వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను’అని బహిరంగ ప్రకటన చేసే దాక పరిస్థితి వచ్చింది. నోరున్న నేతగా పేరున్న ఆయన, ఇప్పుడు అన్నీ సర్దుకొని పార్టీకి కట్టప్పనని చెప్పుకోవాల్సి వస్తున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : పార్టీలో చేరి.. అధికారం చేపట్టినప్పటి నుంచీ అసలు కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతూ వస్తున్న ‘ముఖ్యనేత’ ఏకంగా కొందరిని రాజకీయాల నుంచి తప్పించడమే పనిగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. భవిష్యత్తులో తనకు ముప్పు అనుకున్న క్యాబినెట్ మంత్రులకు ఇప్పటికే ముకుతాడు వేసి అదుపులో పెట్టుకోగా, పనిలోపనిగా అసలు కాంగ్రెస్ నేతలకు వ్యూహాత్మకంగా రిటైర్మెంట్ ఇచ్చి మూలకు కూర్చోబెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది. రేపటి రోజున అనూహ్య పరిణామాలేమైనా జరిగితే ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే కాదు, దిగువ శ్రేణి నాయకుల బలమూ అవసరమనే ఆలోచన చేసి, కాంగ్రెస్ వృక్షానికి ఉన్న పండు కొమ్మలను పొతంపట్టే పనిలో పడ్డట్టు సొంత పార్టీ నేతలల్లోనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అధిష్ఠానం వద్ద చక్రం తిప్పగలిగే సీనియర్లను ఒకొక్కర్నీ అడ్డు తొలగించుకొని, వారి స్థానాన్ని తన అనుయాయులతో నింపుతున్నారనే ప్రచారం జరుగుతున్నది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మహావృక్షం లాంటి అసలు కాంగ్రెస్ నేత రాజకీయ జీవితాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించారనే ప్రచారం జరుగుతున్నది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడు సార్లు మంత్రిగా పనిచేసిన ఆయనకు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నది. కాంగ్రెస్ అధికారంలో లేని రోజుల్లోనే ఎమ్మెల్సీగా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచారు. పార్టీ అధికారంలోకి వస్తే అధిష్ఠానం వద్ద ఆయనకు ఉన్న పలుకుబడితో మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ ముఖ్యనేత ఆయనను కూరలో కల్యమాకును తీసేసినట్టు తీసేశారని కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న ఆయనకు చెప్పకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఫిరాయింపునకు ప్రోత్సహించి కాంగ్రెస్‌లోకి లాగారని, నేరుగా సీఎంవో జోక్యం చేసుకొని ఎమ్మెల్సీని పక్కకు పెట్టి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు పను ల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని కలెక్టర్ సహా ప్రభుత్వ అధికారులను ఆదేశించారని ప్రచారం జరిగింది.
ఇది ఎమ్మెల్సీతో పా టుతోపాటు ఆయన అనుచరులను ఆందోళనకు గురిచేసింది. తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. ఆయన రాజీనామా చేస్తే అధిష్ఠా నం వద్ద పరువు పోతుందని గమనించిన ముఖ్యనేత ఓ మధ్యవర్తిని పంపి సముదాయించినట్టు సమాచారం. ఈలోగా ఆయ న పదవీ కాలం మగిసింది. ఎమ్మెల్సీగా మళ్లీ ఆయనకే టికెట్ ఇస్తారని అనుకుంటే తీరా ఎన్నికల సమయానికి ఆయనకు షాక్ ఇస్తూ వలస నేతను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చారని, కానీ ఉత్తర తెలంగాణ ప్రజలు ఆ అంటుకొమ్మను పిలక దశలోనే తుంచివేశారని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు.
రాష్ట్రంలో నంబర్ 2 అని చెప్పుకొంటున్న మంత్రి ఒకరు అదే నియోజకవర్గానికి పర్యటనకు వెళ్లినప్పుడు సదరు సీనియర్ కాంగ్రెస్ నేత ఎదురు పడగా నంబర్ 2 మంత్రి ఆలింగనం చేసుకోబోయారు. ఒక్కసారిగా సదరు సీనియర్ మంత్రి దూరం జరిపి నమస్కారం పెట్టి పక్కకు జరుగుతూ ‘దుష్ట కౌగిలి’ అనే రన్నింగ్ కామెంట్ చేశారని, ఆ కామెంట్ తో మంత్రికి దిమ్మ తిరిగినంత పనైందని పార్టీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. ఆ సందర్భంలోనే ‘దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో ఉండి పోరాటం చేసి నం. ఇవ్వాళ తినబోయే ముందు వేరేవాళ్లు వచ్చి కంచం గుంజుకున్నట్టు ఉన్నది మా పరిస్థితి.. మాపనైపోయింది. ఇక రాజ్యం ఏలండి’ అంటూ సదరు నేత నిర్వేదంతో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
తాను ఎప్పటికైనా తెలంగాణకు సీఎం అవుతానంటూ ప్రకటనలు ఇచ్చే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నోరున్న నేత ఒకరు ముఖ్యనేత దెబ్బకు పార్టీకి కట్టప్పను అని తనకు తాను స్వయంగా ప్రకటన చేసుకున్నట్టు మెదక్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. ఒక దశలో ఆయన ఇక తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయట్లేదంటూ, తన అనంతరం ఆ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థి ఎవరో కూడా స్పష్టంచేశారని స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సదరు నేతను కాంగ్రెస్ అధిష్ఠానం పిలిచి ఎమ్మెల్సీగా ప్రకటించి మంత్రి పదవి ఇస్తుందని ఆయన వర్గం విస్తృత ప్రచారం చేసింది. కానీ ముఖ్యనేత మంత్రాంగం చేసి ఎమ్మెల్సీ పదవే రాకుండా చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. పెద్దనోరున్న నేతగా పేరున్న ఆయనను ముఖ్యనేత దూరం పెట్టకుండా, దగ్గరికి తీయకుండా వ్యూహాత్మకంగా రాజకీయం చేశారని ప్రచారంలో ఉన్నది. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కార్పోరేషన్ పదవి కట్టబెట్టి నియోజకవర్గానికి పరిమితం చేసినట్టు స్థానిక కార్యకర్తలు చెప్తున్నారు.
పాలమూరు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత ఉమ్మడి రాష్ట్రంలో ఏకంగా సీఎం పదవికి పోటీ పడ్డట్టు ప్రచారంలో ఉన్నది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైఎస్ ప్రభుత్వంలో మం త్రిగా పనిచేశారు. 2009ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పట్లో వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణకు చెందిన వ్యక్తిని సీఎంగా పెట్టాలనే ఆలోచన చేసినప్పుడు సోనియా ఆయన పేరునే సూచించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన ఎమ్మెల్యే కాకపోవడంతో అధిష్ఠానం రోశ య్య వైపు చూసిందని ఇప్పటికీ కాంగ్రెస్ శ్రేణుల్లో ప్రచారం ఉన్నది. నిజానికి ఇప్పుడున్న ముఖ్యనేత జడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టక ముందే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారని పార్టీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.
అధిష్ఠానంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో సదరు నేత ఎప్పటికైనా తనకు ముప్పుగా మారవచ్చని పసిగిట్టిన ముఖ్యనేత.. 2023లో కాంగ్రెస్ ఆయనకు ఇచ్చి న టికెట్‌ను రద్దు చేయించి, తన వర్గం అభ్యర్థికి టికెట్ ఇప్పించుకున్నారనే ప్రచా రం జరిగింది. ఇటీవల ఆయనను కీలకమైన పార్టీ పదవి నుంచి తొలగించి, తన అనుచరుడిగా ముద్రపడిన నేతకు ఇప్పించుకున్నట్టు హస్తం శ్రేణులు చెప్తున్నాయి. రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత 2004లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆయనకు ఖరారైనట్టేనని ప్రచారం జరిగింది. కానీ ముఖ్యనేత లాబీయింగ్‌తో ఆయన వెనుకబడి, అదే జిల్లాకు చెందిన బీసీ నేతకు పదవి వచ్చినట్టుగా గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి.