హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : ఐటీ ఉద్యోగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తెచ్చిన గుణాత్మక మార్పులకు అనుగుణంగా ఇంజినీర్ల మైండ్‌సెట్ మారుతున్నది. దీంతో ఏఐ స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ చేసినట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. దేశంలో 67% మంది ఇంజినీర్లు ఏఐ స్కిల్స్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తాజా సర్వే పేర్కొన్నది. ‘ఎడ్టెక్ ఫర్మ్ గ్రేట్ లెర్నింగ్’ తాజా అధ్యయనం వివరాలు వెల్లడించింది. ప్రతి 10 మంది ఇంజినీర్లలో 8 మంది ఏఐ స్కిల్స్ నేర్చుకోవడంపై దృష్టి సారించినట్టు పేర్కొన్నది. ‘ఇంజినీర్స్ డే’ను పురస్కరించుకుని ఈ రిపోర్టును సదరు సంస్థ రిలీజ్ చేసింది. టెక్నాలజీలో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కెరీర్‌ను తీర్చుదిద్దుకునేందుకు యువత మొగ్గు చూపుతున్నట్టు రిపోర్టు స్పష్టంచేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో 85% మంది ఇంజినీర్లు 2026 నాటికి ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు పేర్కొన్నది. ఇంజినీర్లు ప్రస్తుతం నేర్చుకోవాలనుకుంటున్న టాప్ లిస్టులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మిషన్ లెర్నింగ్(ఎంఎల్) మొదటి స్థానంలో ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. ఇందులో జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ, పైథాన్ ప్రోగ్రామింగ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రొసెసింగ్(ఎన్ఎల్పీ)కు డిమాండ్ ఉండగా.. వీటిలో నైపుణ్యం సాధించే ఇంజినీర్లు కసరత్తు చేస్తున్నట్టు అధ్యయనం పేర్కొన్నది.
స్కిల్స్ పెంపొందించుకోవడం ద్వారా కెరీర్లో ఎదుగుదల(45%), ఆర్థికాభివృద్ధి(20%), ప్రమోషన్లు(12%) కొత్త ఉద్యోగ అవకాశాలు(12%) చోటు చేసుకుంటున్నట్టు అధ్యయనం వెల్లడించింది. నైపుణ్యాలు పెంపొందించుకోవడం ద్వారా స్కిల్స్‌లో వెనకబాటు(11%) తగ్గుతున్నట్టు తెలిపింది. అయితే స్కిల్స్ పెంపొందించుకునేందుకు 66% మంది ఇంజినీర్లు షార్ట్ టర్మ్ కోచింగ్ వైపు ఆసక్తి చూపుతున్నట్టు తెలిపింది. కేవలం 5% మంది ఏడాదికిపైగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది. అనేక మంది ఇంజినీర్లు మన దేశంతోపాటు అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందేందుకు ఆసక్తి కనబరస్తున్నట్టు తెలిపింది. ఈ మార్పు ఐటీ రంగంలో స్కిల్స్‌కు ఉన్న ప్రాముఖ్యతను స్పష్టంచేస్తున్నది. ఇక ఏఐతో వచ్చిన మార్పులతో దేశంలో 85% మంది ఇంజినీర్లు ఈ ఏడాది ఉద్యోగాలు మారినట్టు అధ్యయనం వెల్లడించింది. ఇందులో 33% మంది వర్క్‌లైఫ్‌ను బ్యాలెన్స్ చేసేందుకు జాబ్ మారగా, ఉద్యోగ భద్రత కోసం 18% మంది, కెరీర్లో వెనకబడొద్దని మరో 14% మంది ఉద్యోగం మారినట్టు పేర్కొన్నది. అయితే కేవలం డిగ్రీలు, కోర్సుల సర్టిఫికెట్ల ఆధారంగా కాకుండా.. ఏఐపై ఎవరు పట్టు సాధిస్తారో వారికే ఉద్యోగ అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయని, వారికే తొందరగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీని నేర్చుకున్న వారికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయని వారంటున్నారు.
ఇప్పటికే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నవారు ఏఐలో నైపుణ్యాలు పెంచుకోవాలి. గూగుల్ సైతం తమ కంపెనీలో ఉద్యోగులకు ఏఐ నేర్చుకోవాలని తాజాగా ఆదేశాలు జారీచేసింది. భవిష్యత్తులో ఏఐలో స్కిల్స్ ఉన్న వారికే మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఏఐతో వస్తున్న మార్పులకు అనుగుణంగానే ప్రభుత్వాలు ఏఐ సిటీలు నిర్మిస్తున్నాయి. కేవలం ఐటీ అని కాకుండా మిగతా రంగాలపై కూడా భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఉంటుంది. అయితే ఇప్పుడే ఏఐ కారణంగా ఎంత మంది ఉద్యోగాలు పోతాయని చెప్పలేం. ఏఐలో చాలా అడ్వాన్స్డ్ టూల్స్ వచ్చాయి. మనం ఫోన్లో వాయిస్ రికార్డు చేస్తుండగానే.. అక్షరాలు టైప్ అయ్యే టెక్నాలజీ సైతం వచ్చింది. అందుకే ఏఐ కారణంగా అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి.
-టెక్నోజెన్ సీఈవో లాక్స్ చేపూరి