హనుమకొండ, సెప్టెంబర్ 21 : హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో డాక్టర్ అలేఖ్య పుంజాల ప్రదర్శించిన కూచిపూడి జానపద నృత్య రూపకం చాకలి ఐలమ్మ వీరత్వాన్ని చాటిచెప్పింది. ఆదివారం తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
నృత్య రూపకాన్ని తిలకించిన వారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య, బృందా న్ని అభినందించి ఘనంగా సతరించారు. తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని చాటి చెప్పిన వీర వనిత చాకలి ఐలమ్మ జీవిత చరిత్రను సంప్రదాయ కూచిపూడి, జానపద శైలిలో అద్భుత నృత్య రూపకంగా ప్రదర్శించి ఉత్తేజితులను చేశారు. 30 మందికి పైగా అలేఖ్య బృందం ఐలమ్మ జీవిత చరిత్రను సాక్షాతరింపజేశారు. సుమారు 45 నిమిషాల పాటు కొనసాగిన ఈ నృత్య రూపకాన్ని దివంగత రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ రచించగా, డాక్టర్ అలేఖ్య పుంజాల నృత్య దర్శకత్వం వహించగా, వీబీఎస్ మురళి బృందం సంగీత సహకారం అందించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు, మేయర్ గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సీపీ సన్‌ప్రీత్‌సింగ్, జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్, చాకలి ఐలమ్మ ముని మనుమరాలు చిట్యాల శ్వేత, అధికారులు పాల్గొన్నారు.