Pharma City | యాచారం, ఫిబ్రవరి8: ఫార్మాసిటీని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధిత రైతులు తెలిపారు. ప్రాణం పోయినా ఫార్మాకు భూములు చ్చేదిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డకొని తీరుతామని నాలుగు గ్రామాలకు చెందిన అన్నదాతలు ముక్తకంఠంతో నినదించారు. ఫార్మాకు భూములిచ్చేదిలేదని ఇప్పటికే ప్రభుత్వానికి తేల్చి చెప్పినప్పటికి మళ్లీ రైతులకు నోటీసులు పంపించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.
నోటీసులు అందుకున్న రైతులు వ్యక్తిగతంగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో శనివారం రైతులు పెద్ద ఎత్తున కొంగరకలాన్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప ఆదేశాల మేరకు రైతులకు తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయానికి రైతులు రావొద్దని కోరారు. కానీ అభిప్రాయ సేకరణకు వెళ్లకుంటే రైతులకు నష్టం జరుగుతుందని, రైతులు రాలేదనే సాకుతో అధికారులు తమ పని తాము చేసుకుంటారని, నోటీసులు అందుకున్న రైతులందరూ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని ఫార్మా వ్యతిరేక పోరాట సమితి సమన్వయ కర్త కవుల సరస్వతి రైతులకు సూచించారు. ఆమె సూచన మేరకు రైతులు తరలేందుకు నడుంబిగించారు.
Pharma City2
నోటీసులు అందుకున్న 250మంది ఫార్మా బాధిత రైతులు మేడిపల్లి గ్రామంలో ఉన్న ఫార్మా వ్యతిరేక పోరాట సమితి స్తూపం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి, నల్లజెండాను ఆవిష్కరించారు. ఫార్మాసిటీని వేంటనే రద్దు చేయాలని, బలవంతపు భూ సేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించాలని, జై కిసాన్.. జై జైవాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు ఆంక్షలు విధించారు. యాచారం, ఇబ్రహీంపట్నంలో బందోబస్తు ఏర్పాటు చేయగా విషయం తెలుసుకున్న రైతులు మేడిపల్లి స్తూపం వద్ద ఒకే చోట కలిసి ట్రాక్టర్ల ద్వారా కలెక్టరేట్‌కు చేరుకోవాలనుకున్న సుమారు 250మంది నానక్‌నగర్, మేడిపల్లి, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చెందిన రైతులు తమ పంతం మార్చుకున్నారు. అలా కాకుండా ఎవరి గ్రామం నుంచి వారు ట్రాక్టర్ల ద్వారా ప్రధాన రహదారిని టచ్ చేయకుండా లింకు రోడ్ల గుండా కొంగరకలాన్ కలెక్టరేట్‌కు బయలు దేరారు. ఒకవైపు అధికారులు కలెక్టరేట్ రావొద్దని రైతులను ఫోన్ల ద్వారా కోరినప్పటికీ, పోలీసులు అక్కడ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ వారి కుట్రలను తిప్పి కొడుతూ, పోలీసులు, అధికారుల ఆదేశాలను భేఖాతరు చేస్తూ రైతులు ధైర్యంగా ముందుకు సాగారు. మొత్తంగా అడ్డంకులను అధిగమిస్తూ చివరకు విజయవంతంగా గమ్యం చేరుకున్నారు.
ట్రాక్టర్ల ద్వారా కలెక్టరేట్‌కు బయల్దేరుతున్నారనే సమాచారంతో రైతులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాటిపర్తి గ్రామాలలో అక్కడక్కడ పోలీసు సిబ్బంది రైతుల కదలికలను గమనిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు యాచారం మండల కేంద్రానికి చేరుకొని మండలంలో జరుగుతున్న ఫార్మా రైతుల ఘటనపై హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ సీఐ కృష్ణంరాజు, యాచారం సీఐ నరసింహరావును అడిగి తెలుసుకున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో ఒక చోటికి చేరకుండా బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా యాచారం, ఇబ్రహీంపట్నం కేంద్రాలలో నిఘా ఉంచాలని సూచించారు. ఫార్మా గ్రామాలు, రైతులపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టాలని, సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని ఆదేశించారు. రైతులు మాత్రం పోలీసుల కండ్లు కప్పి కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
Pharma City3
ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న రైతుల పర్యటనపై ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆరా తీశారు. యాచారం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎమ్మార్వో అయ్యప్పతో మాట్లాడారు. సమావేశం రద్దని చెప్పినా రైతులు కలెక్టర్ కార్యాలయానికి ఎలా వెళ్తున్నారంటూ ఆర్డీఓ ప్రశ్నించారు. పంచాయతి ఎన్నికల దృష్ట్యా సమావేశానికి రావొద్దని చెప్పలేదా అంటూ అడిగారు. రెండు మూడొందల మంది ఒకే చోట చేరితే సమస్యగా మారుతుందని ఆర్డీఓ సూచించారు. ఇంత మంది కాకుండా ఇరవై ముఫ్పై మంది వస్తే కలెక్టర్‌తో మాట్లాడవచ్చని తెలిపారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రాజు ఆర్డీఓను కలిశారు. శాంతి భద్రతల విషయంపై ఆర్డీఓ ఏసీపీతో చర్చించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. యాచారం, ఇబ్రహీంపట్నం, కొంగరకలాన్‌లో పోలీసుల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
యాచారం మండలంలో ఫార్మా సిటీని వెంటనే రద్దు చేయాలి. రైతులు ఇవ్వని భూములను తిరిగి రైతులకు ఇవ్వాలి. ఆన్లైన్లోటీఎస్ఐఐసీ పేరు తొలగించి రైతుల పేర్లు నమోదు చేయాలి. రైతులకు రైతు భరోసా, రైతు బీమా, పంట రుణాలు, రుణమాఫీ పథకాలు వర్తించేలా చూడాలి. అక్కర నిమిత్తం అమ్మకోవాలనుకునే రైతుల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. రైతుల గోడును అర్థం చేసుకొని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఫార్మాను రద్దు చేయాలి. ఫార్మాసిటీని రద్దు చేస్తూ స్పష్టమైన జీఓ వచ్చే వరకు ఫార్మాపై రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు చేస్తాం
ఎన్నికల ముందు ఇచ్చిన హామికి కట్టుబడి ఉండకుండా కాంగ్రెస్ నాయకులు రైతులను మోసం చేశారు. అధికారంలోకి రాగానే ఫార్మా సిటిని రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారు. రైతుల వెంట ఉండి, రైతుల సమస్యలు తెలుసుకొని, రైతులతో కలిసి పాదయాత్రలు చేసి నేడు అధికారంలోకి వచ్చి పదువులు రాగానే కాంగ్రెస్ నాయకులు ఫార్మా బాధిత రైతులను విస్మరించారు. గతంలో యాచారంలో పర్యటించిన డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోదండరాం, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే రంగారెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తమకు పదవులు రాగానే రైతులను పూర్తిగా మర్చిపోవడం తగదు.
రైతుల నుంచి ఫార్మా సిటీ ఏర్పాటుకు బలవంతపు భూ సేకరణ చేయొద్దు. రైతులు భూములు ఇవ్వమని చెప్పినప్పటికీ రైతులకు నోటీసులు ఇచ్చి భూములను బలవంతంగా లాక్కోవడానికి చూస్తే ఊరుకునేదిలేదు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సాగు భూములను ఇచ్చేదిలేదు. రైతులు ఇవ్వని 2,200ల ఎకరాల భూమికి సంబందించి తిరిగి రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించాలని గతంలో హైకోర్టు ఆదేశించినప్పటికి ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం దుర్మార్గం. పచ్చని పంట పొలాలున్న భూములను ఫార్మాకు ఇస్తే రైతు కుటుంబాలు ఎలా బతకాలి. ప్రాణం పోయినా ఫార్మాకు భూములిచ్చేదిలేదు.
యాచారం, కందుకూరు మండలాల్లో ఫార్మాసిటిని ఏర్పాటు చేయొద్దు. ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన హామీ ప్రకారం ఫార్మాను పూర్తిగా రద్దు చేయాలి. ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వం ద్వంద వైఖరిని ప్రదర్శిస్తున్నది. ఫార్మాసిటీ కాదు ఫార్మా క్లస్టర్లు అంటూ కాంగ్రెస్ నాయకులు రైతులను అయోమయానికి గురిచ్తేన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓను విడుదల చేయాలి. ఫార్మాసిటీ, ప్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ అంటూ చెబుతున్న ప్రభుత్వం అసలు ఏ సిటీ నిర్మిస్తారో తెలియని గందరగోళం నెలకొంది. రైతుల భూములను బలవంతంగా లాక్కోవద్దు. రైతులివ్వని 2,200ల ఎకరాల భూమిని టీఎస్ఐఐసీ పేరు తొలగించి రైతుల పేర్లు నమోదు చేయాలి. రైతు సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాలు చేస్తాం.