Perni Nani | ఆర్ఎంపీ వైద్యుడిపై దాడి ఘటనను మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కామెంట్ చేశాడని ఓ ఆర్ఎంపీ వైద్యుడిపై జన సైనికులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. వారిని పోలీసులు అదుపు చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఓ యూట్యూబ్ చానల్లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం సత్రెంపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ గిరిధర్ సమాధానమిస్తూ పవన్ కల్యాణ్‌పై కామెంట్ చేశారు. దీనిపై జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఆయనపై దాడి చేసి బలవంతంగా క్షమాపణలు చెప్పించారు. ఈ ఘటనపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలపై ఆయన వ్యాఖ్యలు చేశారని.. ఆ మాత్రం దానికే ఆయనపై దాడి చేస్తారా అని పేర్ని నాని మండిపడ్డారు. జనసేన ముసుగులో రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిధర్ ఇంటికి వందమందికి పైగా జనసేన కార్యకర్తలు వెళ్లి బీభత్సం సృష్టించారని తెలిపారు. రజకుడనే చిన్నచూపుతోనే గిరిధర్‌పై దాడి చేశారని ఆరోపించారు. మరి పవన్ కల్యాణ్‌ను మిగిలిన కులాలకు చెందిన వాళ్లు కూడా ప్రశ్నిస్తున్నారు కదా.. వాళ్ల మీద ఎందుకు ప్రతాపం చూపించలేకపోతున్నారని నిలదీశారు. దాడి చేయడానికి మీకు బలహీనులే మీకు కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు.
జనసేన ముసుగులో ఉన్న గూండాలను కంట్రోల్ చేయాలని కృష్ణా జిల్లా ఎస్పీని పేర్ని నాని కోరారు. ఆ రౌడీలను కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే నమస్కారం పెట్టలేదని పోలీసులను కొట్టే స్థితికి వచ్చారని.. జగన్ మోహన్ రెడ్డిని, నన్ను, నా కుమారుడిని కూడా నోటికొచ్చినట్లు తిడుతున్నారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని అన్నారు. గిరిధర్, సతీశ్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.