Tadipatri | అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేతిరెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా జేసీ అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు అనుమతి తీసుకుని మరీ తాడిపత్రిలోకి అడుగుపెట్టారు. అయినప్పటికీ కేతిరెడ్డిపై జేసీ వేధింపులు ఆగడం లేదని తెలుస్తోంది. తాజాగా కేతిరెడ్డి నివాసానికి వెళ్లి మున్సిపల్ అధికారులు కొలతలు వేశారు.
మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి కేతిరెడ్డి తన నివాసాన్ని కట్టుకున్నారని పెద్దారెడ్డికి తాడిపత్రి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనంతరం ఆయన ఇంటి వద్ద సర్వే చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న కేతిరెడ్డి.. తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారు. తన ఇళ్లు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు. తన ఇంటి స్థలంలో మున్సిపల్ స్థలం ఆక్రమించలేదని వివరించారు.
కేతిరెడ్డి పెద్దారెడ్డి భవనానికి మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ లేదని.. 10 సెంట్లకు గానూ 12 సెంట్లలో ఇంటి నిర్మించారని తాడిపత్రి మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారిణి సుజాత తెలిపారు. కొలత నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని పేర్కొన్నారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
కాగా, నా ఇంటికి ప్లానింగ్ ఉందో.. లేదో అధికారులే తెలియజేయాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. సర్వేలో 1వ ప్లాట్ నుంచి 16వ ప్లాట్ వరకు సర్వే చేయాలని.. ప్రతి ఒక్క నివేదికను తనకు కచ్చితంగా అందజేయాలని అధికారులను కోరారు. సర్వే తర్వాత మున్సిపాలిటీ స్థలం ఎంత ఉన్నది తనకు నివేదిక అందజేయాలని మున్సిపల్ అధికారులను కేతిరెడ్డి పెద్దారెడ్డి కోరారు.ఎక్కడి నుంచి కొలిచినా, ఇరువైపులా కొలతలు వేయాలని.. మీరు కొలతలు వేసిన తర్వాత రాతపూర్వకంగా నివేదిక అందిస్తే.. ఏం చేయాలో అది చేస్తా అంటూనే.. మీరేం చేయాలో అది చేయండని అధికారులతో వ్యాఖ్యానించారు.