Shriya | తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని హీరోయిన్ శ్రియా శరణ్ , దాదాపు ఇరువై సంవత్సరాలుగా తన నటన, గ్లామర్, డాన్స్‌తో అభిమానులను అలరిస్తూ వస్తోంది. 2001లో ఇష్టం సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె, సంతోషం , నేనున్నాను , శివాజీ: ది బాస్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్డమ్ సంపాదించింది. ముఖ్యంగా రజనీకాంత్‌తో చేసిన శివాజీ ఆమె కెరీర్‌కు మేజర్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, పాన్–ఇండియా స్థాయిలో అభిమానులను సంపాదించారు. తాజాగా మిరాయ్ సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి తన నటనతో మెప్పించారు.
‘హను-మాన్’ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తేజా సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన హై-బడ్జెట్ ఫాంటసీ యాక్షన్ మూవీ మిరాయ్ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. తేజా సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా సరన్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్, ఫాంటసీ, ఎమోషన్ కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మిరాయ్ టీం ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షో లో పాల్గొంది. ఇందులో శ్రియా సరన్, జగపతి బాబు, తేజా సజ్జా, రితికా నాయక్ సరదా సంభాషణలు, డ్యాన్స్ స్టెప్స్‌తో షోకు జోష్ తెచ్చారు. ముఖ్యంగా జగపతి బాబు చేసిన కామెంట్స్‌తో నవ్వులు పూశాయి.
ఈ సందర్భంగా శ్రియా తన ప్రేమకథను తొలిసారి షోలో వెల్లడించారు. ఒకసారి మాల్దీవుల ట్రిప్‌కి ఒంటరిగా వెళ్లినప్పుడు రష్యా టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కోశ్చీవ్ తో పరిచయం ఏర్పడిందని, అక్కడినుంచి వారి బంధం మొదలైందని తెలిపారు.అనుకున్న డేట్ కాకుండా పొరపాటున వేరే డేట్‌కి ఫ్లైట్ బుక్ చేయడంతో ఫ్రెండ్స్‌తో పాటు కాకుండా తాను ఒంటరిగా వెళ్లాల్సి వచ్చిందట. ఆ సమయంలో ఆండ్రీ పరిచయం కావడం, మొదటి పరిచయం నుంచే ఇద్దరి మధ్య అడ్వెంచరస్ జర్నీ మొదలైందని చెప్పుకొచ్చింది. ఆసక్తికరంగా, ఆండ్రీ మొదటగా నేను నటించిన దృశ్యం చూశారు. ఆ సినిమాలోని పాత్ర చూసి మొదట భయపడ్డప్పటికీ, తర్వాత ప్రేమ బలపడిందని చెప్పారు. 2018లో వీరిద్దరూ వివాహం చేసుకోగా, 2021లో పాప రాధ పుట్టింది. ప్రస్తుతం ఆండ్రే వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు.