Shashi Tharoor : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన టారిఫ్స్ భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) అన్నారు. ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని, ట్రంప్ వ్యవహారశైలి, స్వభావం పూర్తి గందరగోళంగా ఉన్నాయని మండిపడ్డారు. సింగపూర్‌లో క్రెడాయ్ (CREDAI) ఏర్పాటు చేసిన సమావేశంలో థరూర్ మాట్లాడుతూ.. సంప్రదాయ దౌత్య ప్రమాణాలను ట్రంప్ గౌరవించడం లేదని విమర్శించారు.
‘ట్రంప్ కంటే ముందు కూడా 45 మంది అమెరికా అధ్యక్షులుగా పనిచేశారు. కానీ వైట్‌హౌస్ నుంచి ఈ రకమైన ప్రవర్తనను ఎన్నడూ చూడలేదు. ఏ రకంగా చూసినా ట్రంప్ అసాధారణ అధ్యక్షుడు. సంప్రదాయ దౌత్య ప్రమాణాలను ఆయన గౌరవించడం లేదు. నోబెల్ శాంతి బహుమతికి అర్హుడనని గతంలో ఏ దేశాధినేతైనా చెప్పడం విన్నామా..? ప్రపంచంలోని అన్ని దేశాలు మా వద్దకే వచ్చి మోకరిల్లుతాయని చెప్పడం విన్నామా..? భారత్, రష్యాలవి డెడ్ ఎకానమీలు అని చెప్పడం ఎప్పుడైనా విన్నామా..? ఓ దేశాధ్యక్షుడి నుంచి వినిపించకూడని భాష ఇది. అందుకే ఆయన అసాధారణ అధ్యక్షుడు. ట్రంప్ ప్రవర్తన ద్వారా మా పనితీరును నిర్ణయించవద్దు’ అని థరూర్ అన్నారు. దాదాపు 1000 మందికిపైగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్న సమావేశంలో శశిథరూర్ పైవిధంగా విజ్ఞప్తి చేశారు.
సుంకాల ప్రభావం భారత్‌పై పడుతోందని, ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని థరూర్ చెప్పారు. సూరత్‌లోనే ముత్యాలు, ఆభరణాల వ్యాపారంలో 1.35 లక్షల మందికి లేఆఫ్‌లు విధించారని తెలిపారు. సముద్రపు ఆహారం, తయారీ రంగంలోనూ ఈ ప్రభావం కనిపిస్తోందన్నారు. టారిఫ్‌ల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోందని చెప్పారు. అనేక ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని, ప్రస్తుతం అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడం కష్టంగా మారిందని పేర్కొన్నారు.
అయితే అమెరికాతో భారత్ సంప్రదింపులు కొనసాగిస్తుండటం మంచి పరిణామమే అన్నారు. అమెరికా సుంకాల ప్రభావాన్ని తగ్గించేందుకు ఇతర మార్కెట్లకూ మన ఎగుమతులను విస్తృత పరచాల్సిన అవసరం ఉందన్నారు.