జూలూరుపాడు, ఏప్రిల్ 23 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 25న సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఈ జిల్లా భూములకే వినియోగించాలనే డిమాండ్‌తో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సదస్సును జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొండపల్లి శ్రీధర్ కోరారు. బుధవారం జూలూరుపాడు మండలంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు.
ఈ క్రమంలో రామచంద్రపురం గ్రామంలో పార్టీ మండల కార్యదర్శి యాస నరేశ్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో శ్రీధర్ మాట్లాడారు. అశ్వాపురం మండలంలో ప్రారంభమై రోల్లపాడు రిజర్వాయర్‌కు తరలించి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును కేవలం నాగార్జునసాగర్ ఆయకట్టు స్థిరీకరణ పేరుతో ఈ జిల్లా నుంచి ఇతర జిల్లాలకు నీళ్లు తరలించుకపోయే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. దానికి మద్దతుగా స్థానిక మంత్రులు తమ నియోజకవర్గం, తమ స్వార్ధ ప్రయోజనాలతో ఈ జిల్లాకు అన్యాయం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
కాల్వ నిర్మాణానికి ఈ జిల్లా రైతుల నుంచి భూములు తీసుకుని జిల్లాలో ఎక్కడా పిల్ల కాల్వలు తీయకుండా, కేవలం సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కొరకే అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ప్రారంభం చేసి ఈ జిల్లాకు అన్యాయం చేయాలని చూస్తుందన్నారు. జూలూరుపాడు మండలం పూర్తిగా వర్షాధారిత ప్రాంతమని, ఇక్కడి భూములకు సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యురాలు పద్దం సుగుణ, శాఖ కార్యదర్శి నరసింహారావు, పార్టీ సభ్యులు ఇందిరా, సరిత, చంద్రయ్య, ఈసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.