ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ ఓటమికి రంగం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ పార్టీ భరతం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ అణిచివేతను ఎదిరించి నిలబడి బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను ఆయన అభినందించారు.
అనంతరం మాట్లాడుతూ.. ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ఓటమి ఖాయమని కేటీఆర్ జోష్యం చెప్పారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల రూపంలో క్వార్టర్ ఫైనల్స్ ముగిశాయని, క్వార్టర్ ఫైనల్స్‌లో మనం మంచి ఫలితాలు సాధించామని కేటీఆర్ అన్నారు. ఇక మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల రూపంలో సెమీఫైనల్స్ జరుగబోతున్నాయని, సెమీఫైనల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికల రూపంలో ఆఖరికి ఫైనల్స్ పోరు ఉంటుందని, ఫైనల్స్‌లో ఖమ్మం జిల్లా నుంచి 7 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని పెద్దలు ఉపేందర్ రెడ్డి చెప్పారని కేటీఆర్ తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి మళ్లీ కేసీఆర్‌ను సీఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.