అమీర్పేపట్, అక్టోబర్ 18: పెండింగులో ఉన్న స్కాలర్షిప్పులు, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కూకట్పల్లి విభాగ్ సికింద్రాబాద్ జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్సార్‌నగర్ ఉమేష్ చంద్ర చౌరస్తాలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనాథ్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ.7,500 కోట్ల స్కాలర్ షిప్పులు, ఫీజు రీయింబర్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ బాలు మాట్లాడుతూ తెలంగాణలో పాలకులు ఉన్నారా? ప్రజల జీవన ప్రమాణాలు ఎందుకు ఇట్లా అథపాతాళంలోకి వెళ్తున్నాయంటూ విద్యార్థి లోకం పెద్ద ఎత్తున విమర్శిస్తోంది. తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం రాష్ట్రంలో విద్యారంగం పతనానికి ప్రధాన కారణమవుతోందని, విద్యా వ్యవస్థపై, పాలనా యంత్రాంగంపై అవగాహన లేకపోవడంతో ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతున్నారని పలువురు విద్యార్థులు గొంతెత్తి రోడ్ల మీదకు వచ్చి నినదించారు.
బడ్జెట్లో అతి తక్కువగా కేవలం 6.5 శాతం నిధులను మాత్రమే విద్యా రంగానికి కేటాయించడాన్ని చూస్తుంటే ఈ ప్రభుత్వనికి విద్య పట్ల ఎంతటి చిత్తశుద్ధి ఉందో తెలుస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విద్యారంగం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారిందని విమర్శించారు. రీయింబర్స్మెంట్ ఆధారంగా రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఉచితాలకు కాకుండా విద్యార్థులకు బాసటగా నిలిచి తమ శ్రేయస్సుకు పాటుపడాలని సూచించారు. ధర్నాకు దిగిన విద్యార్థి నాయకులు నందు, శ్రీరామ్, వంశీ, విజయ్, నరేష్, ఉదయ్, కార్తీక్, మోహన్, పవన్ తదితరులను ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు.
ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
రామంతాపూర్: ఏబీవీపీ ఆధ్వర్యంలో రామంతాపూర్ ప్రధాన రహదారిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి మహేంద్ర, వరుణ్, సాగర్, శివ, శశి, అఖిల్, ప్రవీణ్, భాను పాల్గొన్నారు.
విద్యార్థి వ్యతిరేకతతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు..
పీర్జాదిగూడ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉప్పల్ శాఖ ఆధ్వర్యంలో పీర్జాదిగూడ కెనరానగర్ బస్టాప్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం, ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర ఏబీవీపీ కార్యవర్గ సభ్యుడు కార్తీక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నా రూ.7500 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా పేద, బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేయాలన్న దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తుందన్నారు.