– ఐటీసీ పీఎస్పీడీ అడ్మినర్ బ్లాక్ ఎదుట కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా
బూర్గంపహాడ్, మార్చి 25 : 14వ వేతన ఒప్పందం జరుగుతున్న క్రమంలో 13వ వేతన ఒప్పందం పెండింగ్ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందం ఆర్యూ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రూ.22 వేల వేతనం తగ్గకుండా అమలు చేయాలని, లాంగ్లిక్ కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఐటీసీ పీఎస్పీడీ అడ్మినర్ బ్లాక్ ఎదుట డీఆర్డీఓ మిత్రపక్షాలతో కలిసి బుధవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా కార్మిక జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. గత వేతన ఒప్పందంలో రాసిన విధంగా నూతన క్వార్టర్స్ నిర్మాణం, షటిల్ కోర్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలన్నారు. కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా వంద శాతం మెడికల్ సదుపాయం కల్పించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందం కల్పించాలని చెప్పారు, బైక్ స్టాండ్ నిర్మాణం ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్డీయూ మిత్రపక్షాలైన సీఐటీయూ, బీఎంఎస్, ఏఐటీయూసీ, టీఈయూ కార్మిక సంఘాల నాయకులతో పాటు కాంట్రాక్టు కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.