Lung Diseases | దేశంలోని అనేక పట్టణాల్లో పావురాలు బాల్కనీలు, టెర్రేసులు, భవనాల అంచుల్లో సాధారణంగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వాటికి ఆహారం పెట్టడం రోజువారీ ఆచారంగా కూడా మారింది. అయితే, పావురాల విసర్జన (డ్రాపింగ్స్)తో దీర్ఘకాలం పాటు కలిసి ఉండటం ఆరోగ్యానికి, ముఖ్యంగా ఊపిరితిత్తులకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్య పరిశోధనల ప్రకారం, ఎండిపోయిన పావురాల విసర్జన, రెక్కల నుంచి వచ్చే ధూళిలో సూక్ష్మ ప్రోటీన్లు, ఫంగస్, అలెర్జీ కారకాలు ఉంటాయి. ఇవి గాలిలో కలిసినప్పుడు మళ్లీ మళ్లీ శ్వాస ద్వారా శరీరంలోకి చేరితే హైపర్సెన్సిటివిటీ న్యూమోనిటిస్ అనే ఊపిరితిత్తుల సమస్యను ప్రేరేపిస్తాయి. దీర్ఘకాలంలో ఈ ఇన్ఫ్లమేషన్ కారణంగా ఊపిరితిత్తుల్లో శాశ్వత గాయాలు (పల్మనరీ ఫైబ్రోసిస్) ఏర్పడే ప్రమాదం ఉంది.
పట్టణాల్లో పావురాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ ప్రమాదం కూడా పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ ఉన్న రోగుల్లో పక్షులతో సంబంధం ఉన్న అలెర్జీలు, ముఖ్యంగా పావురాల విసర్జన కారణంగా వచ్చే అలెర్జీలు ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తించబడ్డాయి. అయితే ప్రతి ఒక్కరికీ ఈ సమస్య రావాల్సిన అవసరం లేదు. కానీ అలెర్జీలు ఉన్నవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రమాదాలను అర్థం చేసుకుని, ఇంట్లో సరైన పరిశుభ్రత పాటించడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. పావురాల విసర్జన ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పావురాల వల్ల కాకుండా వాటి విసర్జనలో ఉండే సూక్ష్మ కణాల వల్లే అసలు ప్రమాదం ఉంటుంది. ఎండిపోయిన విసర్జన ధూళిగా మారి గాలిలోకి ఎగిరిపోతుంది. ఈ ధూళిలో పక్షి ప్రోటీన్లు, బ్యాక్టీరియా, ఫంగల్ స్పోర్స్ ఉండి, ఇవి శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరతాయి. దీని వల్ల హైపర్సెన్సిటివిటీ న్యూమోనిటిస్ అనే ఇన్ఫ్లమేటరీ సమస్య ఉత్పన్నమవుతుంది.
పరిశోధనల ప్రకారం, పక్షుల వల్ల వచ్చే అలెర్జీలు ఈ వ్యాధికి ముఖ్య కారణంగా ఉన్నాయి. ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్ కేసుల్లో గణనీయమైన శాతం పక్షుల యాంటీజెన్లకు గురైన వారిలోనే కనిపించినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పావురాలు సహా పక్షుల రెక్కలు, విసర్జనలోని ప్రోటీన్లకు అలెర్జీగా ఏర్పడే ఒక ప్రత్యేక పరిస్థితిని బర్డ్ ఫాన్సియర్స్ లంగ్ అని అంటారు. ఈ పరిస్థితిలో శరీర రోగనిరోధక వ్యవస్థ అధికంగా స్పందించి ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. దీర్ఘకాలం ఈ పరిస్థితే కొనసాగితే, ఊపిరితిత్తుల్లో శాశ్వత గాయాలు ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఇది కేవలం పక్షులను పెంచేవారికే కాకుండా, నగరాల్లో నివసించే సాధారణ ప్రజలకు కూడా ప్రమాదమేనని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు గుర్తించడం కష్టమని వైద్యులు తెలియజేస్తున్నారు. ఈ వ్యాధి ప్రారంభంలో సాధారణ జలుబు లేదా శ్వాస సంబంధ సమస్యలా కనిపిస్తుంది. ఎడతెరపి లేకుండా పొడి దగ్గు, శారీరక శ్రమ సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతిలో బిగుతుగా ఉండటం, అలసట, తేలికపాటి జ్వరం లేదా ఫ్లూ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి తీవ్రతరమై ఊపిరితిత్తుల్లో శాశ్వత నష్టం కలిగే అవకాశం ఉంది. తొందరగా కారణాన్ని తొలగిస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
పట్టణాల్లో ఈ ప్రమాదం మరింతగా పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. పట్టణాల్లో ఉన్న ఎత్తైన భవనాలు పావురాళ్లకు గూళ్లు కట్టడానికి అనుకూలంగా ఉంటాయి. ప్రజలు తరచుగా ఆహారం వేయడం వల్ల పావురాల సంఖ్య పెరుగుతోంది. దీంతో బాల్కనీలు, కిటికీలు, పైకప్పులు, ఏసీ యూనిట్లపై విసర్జన ఎక్కువగా పేరుకుపోతుంది. ఎండిపోయిన తర్వాత ఇవి ధూళిగా మారి గాలిలో వ్యాపిస్తాయి.ఆస్తమా, అలర్జీలు లేదా తక్కువ ఇమ్యూనిటీ ఉన్నవారు ఈ ప్రభావానికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. పావురాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై కోర్టులు, పర్యావరణ సంస్థలు కూడా దృష్టి సారించడం ప్రారంభించాయి. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
పావురాల విసర్జనకు దగ్గరగా ఉండడం తగ్గించాలి. ఇది ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది. బాల్కనీలు, కిటికీల వద్ద బర్డ్ నెట్స్ లేదా స్పైక్స్ అమర్చాలి. ఇళ్ల దగ్గర పావురాలకు ఆహారం వేయడం మానుకోవాలి. విసర్జన శుభ్రం చేసే సమయంలో గ్లౌవ్స్, మాస్క్ ఉపయోగించాలి. డ్రైగా ఊడ్చకుండా, తడి విధానంతో శుభ్రం చేయాలి. ఇంటి పరిశుభ్రత, గాలి ప్రసరణ మెరుగుపరచాలి. దగ్గు, ఊపిరితిత్తుల సమస్యలు కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పట్టణ జీవనంలో పావురాలు సహజ భాగంగా కనిపించినా, వాటి విసర్జన ఆరోగ్యానికి దాగి ఉన్న ప్రమాదాలను కలిగిస్తుంది. సరైన అవగాహనతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇంటి పరిశుభ్రతను కాపాడుతూ, పావురాల విసర్జనకు దూరంగా ఉండటం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు.