నా వయసు ఇరవై ఆరు. ఎత్తు ఐదు అడుగుల ఏడు అంగుళాలు. బరువు ఎనభై కిలోలు. నాకిప్పుడు ఐదో నెల. పీసీఓఎస్ సమస్య ఉంది. నా భయమంతా పుట్టబోయే బిడ్డ గురించే. పాపాయి ఆరోగ్యంగా జన్మించడానికి, సహజ ప్రసవం కావడానికి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ఓ సోదరి
పీసీఓఎస్ వల్ల గర్భధారణ సమయంలో పెద్దగా సమస్యలు రాకపోవచ్చు. ప్రత్యేకించి తీసుకోవాల్సిన జాగ్రత్తలూ లేవు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎటూ ఐదో నెలే కాబట్టి ముందు షుగర్ టెస్ట్ చేయించుకోండి. డాక్టర్ సూచనల మేరకు తగిన మందులు వాడండి. స్వీట్లు, నూనె పదార్థాలు తగ్గించండి. అలాగే, యూట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఎక్సర్ సైజులు ఉంటాయి. వాటిని చూసి జాగ్రత్తగా సాధన చేయండి. ఇంటి పనులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. సాధ్యమైనన్ని రోజులు కింద కూర్చోవచ్చు. మరీ ఇబ్బంది లేకపోతే ఇండియన్ టాయిలెట్ వాడొచ్చు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు బాగా తీసుకోవాలి. ఇవన్నీ చేస్తే మీరూ, మీ పాపాయీ ఆరోగ్యంగా ఉంటారు. ఇక, సుఖప్రసవం అన్నది పూర్తిగా మన చేతుల్లో లేదు. బిడ్డ సైజును బట్టి, బయటికి వచ్చే దారిని బట్టి, నొప్పులు ఎలా వస్తాయి అన్నదాన్ని బట్టి ఉంటుంది.
– డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్