డోర్నకల్, ఆగస్టు 23 : రైతు బీమా ప్రీమియం కట్టాలని, లేకపోతే రైతుల పక్షాన ఉద్యమం చేపడతామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్ఎస్ నా యకుడు మాన్యు పాట్నీని ఆదివారం డోర్నకల్‌లో ప రామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మరిపెడ మండలం వెంకంపాడు కాంగ్రెస్ సర్పంచ్ ఉప్పల సోమన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, ఆయన కుటుంబానికి రెండెకరాల భూమి ఉన్నప్పటికీ రైతు బీమా పథకం అందకపోవడం సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనమన్నా రు. కాంగ్రెస్ మాటలు నమ్మొద్దని, ఇంటికి వెళ్లి ఆలోచన చేయాలని కేసీఆర్ ప్రజలకు విడమర్చి చెప్పినా ఆ పార్టీకి ఓటు వేసి ఇప్పుడు గోసపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని విమర్శించారు. పిచ్చోడి చేతిలో రాయిలా సీఎం రేవంత్‌రెడ్డి పాలన ఉందని అన్నారు. కేసీఆర్ పాలనలో లక్షల మంది రైతులకు రైతుబంధు, రైతు భీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మీ పథకం ఆసరాగా నిలిచిందన్నారు.
కాంగ్రెస్ సర్కారు వీటితో పాటు తులం బంగారం ఇవ్వకుండా మంగళం పాడిందన్నారు. రేవంత్‌రెడ్డి చిల్లర పంచాయితీలతో కాలం గడుపుతున్నాడని, రూ. కోట్లు అవినీతి చేసి తమ్ముళ్లకు, అల్లుడుకు కట్టబెడుతున్నట్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయనను తిడుతున్నట్లు చెప్పారు. కల్వకుంట్ల కవిత మాటలకు కాంగ్రెస్ నాయకులు స్పందించడం కాదు.. దమ్ముంటే మంత్రి కొండా సురేఖ బిడ్డ సుస్మిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. నర్సంపేటలో తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మాధవరెడ్డి కూల్చివేశారని విమర్శించారు. డోర్నకల్ ప్రాంతం నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం మొదలవుతుందన్నారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కర్రు కాల్చి వాత పెడతామన్నారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ అంగోత్ బిందు, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మ వెంకటరెడ్డి, మున్సిపల్ కోఆప్షన్ మాజీ మెంబర్ మారబోయిన రాంభద్రం, బీఆర్ఎస్ నాయకుడు బోడ శ్రీను పాల్గొన్నారు.