గ్రామ పంచాయతీ తరపున ఒక మంచి పని చేసినప్పుడు అభినందించాల్సిన అధికారులు.. ఓ అధికార పార్టీ నాయకుడి ఫిర్యాదు చేశాడని షోకాజ్ నోటీస్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. వన మహోత్సవంలో మొక్కలు నాటితే గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మొక్కలు నాటినట్లు ఆరోపణలు వస్తున్నాయని.. దీనిపై వివరణ ఇవ్వాలని నీలోజిపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్‌కు సిరిసిల్ల ఇన్చార్జి పంచాయతీ అధికారి జయశీల నోటీసులు ఇవ్వడం చర్చకు దారి తీసింది. ఇది తనపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యేనని సర్పంచ్ స్పష్టం చేస్తున్నాడు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నాటిన మొక్కలు, గ్రీన్ చాలెంజ్‌లో నాటిన మొక్కలకు ఎలాంటి సంబంధం లేదని సర్పంచ్ వివరణ ఇచ్చాడు. కార్యక్రమం ఏదైనా మొక్కలు నాటి పచ్చదనం పెంచడం తప్పేనా అనే చర్చ జరుగుతున్నది.
కరీంనగర్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో మధ్యమానేరు భూనిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించగా.. ఇంకా 21ఎకరాల ప్రభుత్వ భూమి మిగులుగా ఉన్నది. అందులో హనుమాన్ దేవాలయం వెనుక ఉన్న ఎకరం స్థలంలో వన మహోత్సవం కింద మొక్కలు నాటాలని స్థానిక సర్పంచ్ అనుముల భాస్కర్‌కు గ్రామస్తులు గ్రామ సభలో సూచించగా, తీర్మానం చేశారు. అంతే కాకుండా పంచాయతీ పాలకవర్గంలో కూడా తీర్మానించారు. పిచ్చి మొక్కలు, చెత్తా చెదారంతో నిండి ఉన్న ప్రాంతాన్ని చదును చేయించి, ఈ నెల 13న వన వహోత్సవంలో భాగంగా మామిడి, ఇతర పండ్ల మొక్కలు నాటించారు.
ఇది ఆర్అండ్ఆర్ నిర్వాసితులకు చెందిన భూమిని ఇతర ప్రయోజనాలకు వినియోగించారనే నెపంతో అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ బీసీ సెల్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. నిజానికి వన మహోత్సవానికి రెండు రోజుల ముందే అంటే ఈ నెల 11న గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఇదే గ్రామంలోని కరీంనగర్- సిరిసిల్ల ప్రధాన రహదారికి ఇరువైపులా, డివైడర్ మధ్యన సర్పంచ్ భాస్కర్ మొక్కలు నాటించాడు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన రావడంతో జీర్ణించుకోలేని స్థానిక అధికార పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారని సర్పంచ్ స్పష్టం చేశాడు.
అందులో నిజానిజాలు తెలుసుకోకుండా అధికారులు తనకు ఈ నెల19న షోకాజ్ ఇచ్చారని ఆయన వాపోయాడు. వన మహోత్సవం, గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ రెండు కార్యక్రమాలు వేర్వేరు సమయాలు, సందర్భాల్లో జరిగాయని ఈ నెల 21న వివరణ ఇచ్చానని తెలిపాడు. వేర్వేరు ఫొటోలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు కూడా ఉన్నాయని చెప్పాడు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీ పరిధిలో పచ్చదనం, పరిశుభ్రత కోసం మొక్కలు నాటించడం, సెక్షన్ 52 గ్రామంలో ప్లాంటేషన్ నిర్వహించే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉన్నదని గుర్తు చేశాడు.
ఆ ప్రకారం ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించిన మిగులు స్థలంలో తాను మొక్కలు నాటించానని తెలిపాడు. అది కూడా గ్రామ సభలో, గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశంలో తీర్మానించిన తర్వాతనే నాటించినట్లు వెల్లడించాడు. తనపై ఫిర్యాదు చేసిన అధికార పార్టీ నాయకుడు గతంలో ఇదే గ్రామంలోని రామాలయానికి సంబంధించిన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని, అప్పుడు తాను హై కోర్టుకు వెళ్లి రద్దు చేయించానని గుర్తు చేశాడు. ఆ కక్షతో తనపై అర్థం పర్థం లేని ఫిర్యాదు చేశాడని, దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే షోకాజ్ నోటీస్ ఇచ్చారని సర్పంచ్ భాస్కర్ వాపోయాడు.