బోనకల్లు/ సత్తుపల్లి టౌన్/ ఆళ్లపల్లి/ టేకులపల్లి, ఆగస్టు 7: అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీతోపాటు పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బోనకల్లు, సత్తుపల్లి, ఆళ్లపల్లి ప్రభుత్వ, టేకులపల్లి, గంగారం ఆశ్రమ పాఠశాలల్లో పాఠశాలల ఎదుట ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో శుక్రవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతోపాటు పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయల సంఘాల నాయకులు మాట్లాడుతూ నూతన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ గురుకుల పాఠశాలల టైం టేబుల్ మార్చాలని, కేజీబీవీల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేసి, టైం సేల్ ఇవ్వడంతోపాటు కేర్ టేకర్స్ను నియమించాలని కోరారు. అలాగే ఈ నెల 12,13 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేసి తహసీల్దార్లకు వినతులు, 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న రాష్ట్ర స్థాయి మహా ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు గుగులోతు రామకృష్ణ, సద్దా బాబు, చిన్న రంగారావు, యాకూబ్ పాషా, నాగుల్ మీరా, పి.గోపాలరావు, పి.నరసింహారావు, శాంతారావు, జోగ రాంబాబు, బాబులాల్, భద్రమ్మ, సమ్మయ్య, హరినాథ్, కిశోర్సింగ్, గుగులోతు హరిలాల్ పాల్గొన్నారు.