యాదాద్రి, ఏప్రిల్ 30: యాదాద్రి కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం వసూలు చేయనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. నిత్యం 50 నుంచి 70 వాహనాలు కొండపైకి వస్తున్నట్టు గుర్తించిన అధికారులు ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు శనివారం వెల్లడించారు. కొండపైకి వాహనాల అనుమతికి గంటకు రూ.500 రుసుంతోపాటు గంట దాటితే ప్రతి గంటకు అదనంగా రూ.100 వసూలు చేయనున్నట్టు స్పష్టంచేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఉన్నతస్థాయి అధికారులు, గౌరవ ఉన్నత న్యాయస్థానం ప్రొటోకాల్ వర్తించే గౌరవ జడ్జీల వాహనాలకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. దాంతో పాటు విరాళాలు సమర్పించిన గుర్తింపు కార్డులు చూపించిన దాతల వాహనాలకు కూడా మినహాయింపు వర్తిస్తుందని వివరించారు. కొండ కింద వాహనాలకు జారీచేసే టికెట్టుపై విధిగా సమయం, తేదీని పేర్కొని గంటకు రూ.500 చొప్పున, గంట దాటితే రూ.100 అదనంగా వసూలు చేసి చలాన్ రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు.
వాహనాలను క్యూ కాంప్లెక్స్ ఎదురుగా గల బస్టాండ్, వీఐపీ అతిథి గృహం పక్కన గల ఖాళీ స్థలంలో పార్కింగ్ చేయించాలని ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆదేశించారు. ఈ ఉత్తర్వులు ఆదివారం నుంచి అమలులోకి వస్తాయని స్పష్టంచేశారు. ఉత్తర్వులు కేవలం నాలుగు చక్రాల వాహనాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. కొండపైన స్థలాభావం కారణంగా అధిక సంఖ్యలో వాహనాలకు కొండపైకి చేరకుండా నివారించేందుకు ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు వివరించారు.