ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. గురువారం ఉదయం ప్రారంభమైన భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. యుద్ధం నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా.. విద్యార్థులు బాగున్నామని సమాచారం చేరవేస్తుండగా.. స్వదేశానికి తీసుకెళ్లాలని వేడుకుంటున్నారు.
నిర్మల్(నమస్తే తెలంగాణ)/తాండూర్/గర్మిళ్ల/రెబ్బెన, ఫిబ్రవరి 24 : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించి, బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యం లో భయనక వాతావరణం నెలకొంది. అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. వారి కోసం తల్లిదండ్రులు ఆం దోళన చెందుతున్నారు. తాము క్షేమంగా ఉన్నామని సమాచారం ఎప్పటికప్పుడు వీడియోకాల్స్ ద్వారా తెలుపుతున్నారు.
మంచిర్యాల పట్టణ సీఐ నారాయణ నాయక్ రెండో కుమారుడు అఖిల్ ఎంబీబీఎస్ చదవడానికి రెండు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యం లో అఖిల్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మా ట్లాడుతూ క్షేమంగా ఉన్నానని, తనపై బెంగ పెట్టుకోవద్దని తెలిపాడు. దాడులు ఉక్రెయిన్‌కు తూర్పు ప్రాంతం వైపు జరుగుతున్నాయని, తాము ఉన్న యూనివర్సిటీ పడమర ప్రాంతం వైపు ఉంటుందని అఖిల్ తెలిపాడు. యుద్ధం జరిగే ప్రాంతానికి మాకు సంబంధం లేదని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నాడు.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్‌కు చెందిన సింగరేణి కార్మికుడు మందనపు రామారావు కూతురు స్ఫూర్తి ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. ఐదేండ్లుగా అక్కడే ఉంటుండగా.. ఇది చివరి సంవత్సరం. ఫిబ్రవరి 27న బయల్దేరి మార్చి 1వ తేదీన ఇండియాకు రావాల్సి ఉంది. కానీ.. యుద్ధం నేపథ్యంలో అక్కడే చిక్కుకుంది. తాము సురక్షితంగానే ఉన్నామని తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా స్పూర్తి తెలిపింది.
నిర్మల్ జిల్లాకేంద్రంలోని బుధవార్‌పేట్ కాలనీకి చెందిన సాయికృష్ణ ప్రస్తుతం ఉక్రెయిన్ దేశ రాజధానిలోని కీవ్స్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడి యూనివర్సిటీకి సెలవులు ప్రకటించి విద్యార్థులను వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. తనను స్వదేశానికి రప్పించాలని కోరుతున్నాడు. యుద్ధవాతావరణంతో తాము భయాందోళనలకు గురువుతున్నట్లు చెప్పాడు. అలాగే సాయికృష్ణ తండ్రి ప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురువుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మం డలం కేంద్రానికి చెందిన గుండు హరిప్రసాద్, కౌటాల మండలానికి చెందిన జాతోష్ సాయికిరణ్ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ విద్యార్థుల కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, అధైర్య పడవద్దని భరోసా కల్పించారు.