నందిపేట్, సెప్టెంబర్ 12: ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట్‌కు చెందిన ఆటో డ్రైవర్ సుభాష్ పంచాయతీ అనుమతి తీసుకుని బైపాస్ రోడ్డులో ఏడాది క్రితం ఇల్లు కట్టుకున్నాడు. ఇంటి నంబర్ కోసం ఆన్లైన్లో అప్డేట్ చేసేందుకు గ్రామపంచాయతీకి పలుమార్లు వెళ్లాడు.
చౌడమ్మ కొండూరు పంచాయతీ కార్యదర్శి నవీన్‌కుమార్ డిప్యుటేషన్‌పై నందిపేట్‌కు రాగా, ఇక్కడి కార్యదర్శి సౌమ్య చౌడమ్మ కొండూర్‌కు డిప్యుటేషన్‌పై వెళ్లారు. ఆర్నెళ్ల క్రితం ఇక్కడకు వచ్చిన పంచాయతీ సెక్రెటరీ నవీన్‌కుమార్‌ను సుభాష్ కలువగా, రూ.10 వేలు ఇస్తే పని చేసి పెడతానని చెప్పాడు. చివరకు రూ.8 వేలకు అంగీకరించాడు.
గురువారం పంచాయతీ కార్యాలయంలో ఆటో డ్రైవర్ సుభాష్ నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి నవీన్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.